శ్రీకాకుళంలో కింజరాపు ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. జిల్లాలో తెలుగుదేశం పార్టీ వీరి కనసన్నల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు దివంగత ఎర్రన్నాయుడు జిల్లా టీడీపీని నడిపిస్తే, ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు, సోదరుడు అచ్చెన్నాయుడులు నడుపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో లీడింగ్ రామ్మోహన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అచ్చెన్నా కాస్త రాష్ట్ర రాజకీయాలతో పాటు, అధినేత చంద్రబాబు వెనుకే ఎక్కువ ఉండటంతో, జిల్లాలో రామ్మోహన్ చూసుకుంటున్నారు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెరవెనుక అచ్చెన్నా పని చేస్తుంటే, రామ్మోహన్ తెర ముందు పని చేస్తున్నారు. తాను ఎలాగో శ్రీకాకుళం ఎంపీగా ఉండటం వల్ల, తన పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించేందుకు కష్టపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ తిరుగుతూ, ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.

 

ఇక వీటిల్లో టెక్కలి ఎలాగో అచ్చెన్నది కాబట్టి, అక్కడ రామ్మోహన్ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అయితే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో రామ్మోహన్ బాగానే కష్టపడుతున్నారు. ఓ ప్లాన్ ప్రకారం నియోజకవర్గాల్లో నేతలని కలుపుకుంటూ, ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగో ఎన్నికలకు ఆరు వారాలు బ్రేక్ పడటంతో, ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేసుకుని పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే రామ్మోహన్ ఎంత లీడింగ్ తీసుకుని శ్రీకాకుళంలో కష్టపడిన ఫలితాలు వైసీపీకే అనుకూలంగా వచ్చేలా కనిపిస్తోన్నాయి.

 

ఎన్నికలు ఆరు వారాల్లో జరిగిన, లేదా ప్రభుత్వం ఎలాగో కోర్టుకు వెళ్లింది కాబట్టి, అక్కడేమన్నా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి ఎన్నికలు వెంటనే జరిగిన, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఆధిక్యం కనబడుతుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వెలువడ్డాక శ్రీకాకుళంలో రామ్మోహన్‌కు ఎంత మేటర్ ఉందో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: