చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రకటనలు, హెచ్చరికలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. గెలుపు అవకాశం లేని రాజ్యసభ ఎన్నికల్లో సీనియర్ నేత వర్ల రామయ్యను పోటికి దింపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటిస్తునే తమ ఎంఎల్ఏలకు విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంటుకు చూపించి తమ ఓటును వేయాలని చెప్పాడు. అలాగే విప్ ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

విప్ జారీ చేయటం, అనర్హత వేటు వేయటమనే మాటలను చంద్రబాబు తెలిసి చెప్పాడో లేకపోతే తెలీకుండానే చెప్పాడో అర్ధం కావటం లేదు. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే తన భుజాన్ని తానే చరుచుకునే చంద్రబాబు తనకు తెలీని విషయం లేదనే భ్రమల్లో ఉంటున్నాడు. ఇందులో భాగంగా చేసిందే విప్, అనర్హత ప్రకటనలని అనుమానం వస్తోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయటం సాధ్యంకాదు. విప్ జారీ చేయటమన్నది అసెంబ్లీ సమావేశాలు, పరిధిలో జరిగే ఓటింగ్ సమయాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది రాజ్యసభ ఎన్నికలు. రాజ్యసభ ఎన్నికలకు అసెంబ్లీ సమావేశాలకు ఎటువంటి సంబంధమూ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  కాబట్టి విప్ జారీ అన్న ప్రస్తావనే లేదు.

 

విప్ ప్రస్తావనే లేదు కాబట్టి ఎంఎల్ఏలపై అనర్హత వేటుకు  అవకాశమే లేదు. కాకపోతే పార్టీ ఏజెంటుకు చూపించి ఓట్లు వేయాలన్నది పార్టీ నాయకత్వాల ఇష్టం కాబట్టి అందులో ఎటువంటి సమస్యా లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను పోటిలోకి దింపిన వర్ల రామయ్యకు పార్టీ తరపు ఉన్న 23 ఓట్లు కచ్చితంగా పడతాయన్న నమ్మకం చంద్రబాబులోనే ఉన్నట్లు లేదు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమైపోయినట్లే. అయితే మిగిలిన 20 మంది ఎంఎల్ఏల ఓట్లన్నా పడతాయా ? ఇక్కడే చంద్రబాబులో అనుమానం పెరిగిపోయింది. అందుకనే ఏజెంటుకు చూపించి ఓట్లేయాలని అడుగుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: