తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే ఆ పార్టీ ని ఇప్పుడు కష్టాల్లోకి నెట్టాయా?, తన ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి ఉంటే ఇప్పుడు ఆ పార్టీకి ఈ కష్టాలు తప్పి ఉండేవా ?? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . తన ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే , ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధిక స్థానాలు  గెలుస్తుందోనని , దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చారు . 

 

ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించి ఉంటే , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకున్న వచ్చే నష్టమేమి ఉండేది కాదని టీడీపీ సీనియర్లు అంటున్నారు . అలాగైనా  ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకునే అవకాశం ఏర్పడేదని పేర్కొంటున్నారు . గతం లో చంద్రబాబు చేసిన పొరపాట్ల నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎటువంటి పాఠాలు నేర్చుకున్నట్లు కన్పించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి . స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పాలన కు అద్దం పడుతాయని , ఫలితాలు వ్యతిరేకంగా వస్తే పబ్లిక్ మూడ్ ఆధారంగా పాలన మార్చుకునే వెసులుబాటు లభిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

 

అయితే జగన్మోహన్ రెడ్డి తన పదినెలల పాలనకు రెఫరెండంగా  స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకోకుండా , పార్టీ ఎమ్మెల్యేలకు , మంత్రులకు టార్గెట్లు నిర్దేశించి ఏకపక్షంగా గెలువాలనుకోవడమే ఆయన చేసిన పొరపాటని పేర్కొంటున్నారు . పదినెలల జగన్మోహన్ రెడ్డి పాలన ను చూసి ప్రజలు స్వచ్చంధంగా మెజార్టీ స్థానాలు గెల్చుకునే అవకాశాలున్నప్పటికీ , ఎమ్మెల్యేలు , మంత్రులకు టార్గెట్లు నిర్దేశించడం వల్ల పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు దిగడంతో జగన్ సర్కార్ అప్రతిష్టపాలు కావాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: