నిరుపేదలకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. పోలవరం, పేదల ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో బస్తా మీద రూ. 145 తగ్గించాయి సిమెంట్ కంపెనీలు. గడిచిన ఐదేళ్ళలో బస్తా రూ. 380 ఉంటే ఇప్పుడు రూ. 235 కు ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకరించాయి. సిమెంట్‌ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. జగన్ విజ్ఞప్తి మేరకు సిమెంట్ కంపెనీలు

దిగి వచ్చాయి.

 

సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్‌ సిమెంట్‌ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్‌ సిమెంట్‌ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో సిమెంటు ధరలు రూ. 380 వరకూ ఉన్నాయి.

 

 

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖ 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్‌ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్‌ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల అవసరాలు ఉంటాయని వివరించారు.

 

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలు.. పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, ఈ పట్టాలు తీసుకున్నవారితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్‌ తెలియజేశారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బ్యాగు ప్రత్యేకంగా వేరొక రంగులో ఉండాలని కంపెనీలను కోరారు. పేదలకు ఇళ్ల నిర్మాణం సహా, వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: