మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కేరళలో 23, యూపీలో 12, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6, లద్దాఖ్ లో 4, తెలంగాణలో 4, జమ్మూ కశ్మీర్ లో 3, రాజస్థాన్ 2, ఆంధ్రప్రదేశ్ 1, ఉత్తరాఖాండ్ 1, తమిళనాడులో 1 కేసు నమోదైంది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా 13 మంది రికవరీ అయ్యారు. 
 
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేంద్రం సూచనలతో ఏపీ ప్రభుత్వం ఈరోజు సెలవుల గురించి చర్చించడానికి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండటంతో సీఎం జగన్ సెలవుల గురించి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి 5వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
6 నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించి వచ్చే నెల చివరిలో వారికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు అతి త్వరలో ముగియనున్నాయి. పదో తరగతి పరీక్షలను మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ విద్యార్థులకు సెలవులు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. 
 
అధికారులు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను పరీక్షల వరకు అక్కడే ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాలు డేస్కాలర్, హాస్టల్ విద్యార్థులకు యథాతథంగా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నాయని సమాచారం. ఈరోజు అధికారులు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. భేటీ అనంతరం ప్రభుత్వం అధికారికంగా సెలవులపై నిర్ణయాలను ప్రకటించనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: