రెండు, మూడు నెలల క్రితం ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో వ్యాపారులు కిలో ఉల్లిని 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు విక్రయించారు. ప్రస్తుతం అవసరాలకు మించి దిగుబడులు పెరగడంతో ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. కిలో ఉల్లి హోల్ సేల్ మార్కెట్ లో 15 రూపాయల నుండి 18 రూపాయలు పలుకుతోంది. రైతులు రబీలో భారీగా ఉల్లి సాగు చేయడంతో ధరలు తగ్గాయి. 
 
గతంలో ధరలు భారీగా పెరగడంతో ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో అవసరాలను మించి ఉల్లి ఉత్పత్తి అవుతూ ఉండటంతో మార్కెటింగ్ శాఖ నివేదిక మేరకు కేంద్రం తాజాగా నిషేధం ఎత్తివేసింది. గతంలో ప్రభుత్వం కేపీ ఉల్లిపై కూడా నిషేధం విధించడంతో వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ ఉల్లిపై ఎగుమతులు తొలగించేలా చేశారు. కడప జిల్లాలో విదేశాలకు ఎగుమతి కోసం చిన్న సైజు రకం ఉల్లిని సాగు చేస్తారు. ఆ ఉల్లిపై నిషేధం విధించటంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. 
 
కొన్ని నెలల క్రితం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను వైసీపీ ఎంపీలు కలిసి ఉల్లి రైతుల సమస్యలను వివరించి కేపీ ఉల్లిపై నిషేధం ఎత్తివేసేలా చేశారు. ఆదివారం కేంద్రం దేశంలోని అన్ని రకాల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత కొన్ని రోజుల నుండి ఉల్లి ధర పడిపోతూ ఉండటం, కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు విధించటంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం ఎగుమతులకు అనుమతి ఇవ్వడం ద్వారా ధరలు పెరిగి రైతులకు ప్రయోజనం కలగనుంది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఉల్లి ప్రధానంగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కేంద్రం తాజా నిర్ణయంతో మన రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: