స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా అంశం  రాష్ట్రంలో పెద్ద వివాదమైపోయింది. ఎన్నికల నిర్వహణ అంశం ఇపుడు అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రిస్టేజ్ గా మారిపోయింది. ఎన్నికలు వాయిదా పడటాన్ని జగన్మోహన్ రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. అదే సమయంలో వాయిదాను చంద్రబాబునాయుడు తన విజయంగా ప్రచారం  చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఇపుడు ఈ విషయం పెద్ద సమస్యగా మారిపోయింది.

 

సరే చంద్రబాబు ప్రచారాన్ని పక్కనపెట్టేస్తే ఎన్నికల కమీషనర్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుపడుతూ రాష్ట్రప్రభుత్వం సుప్రికోర్టులో కేసు వేసింది. బహుశా మంగళవారం కేసు విచారణ జరగవచ్చు. ఒకవేళ విచారణంటూ జరిగితే ప్రభుత్వ వాదన చెల్లుబాటవుతుందా అన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. నిమ్మగడ్డేమో కరోనా వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేశారు. అయితే కమీషనర్ పైకి కరోనా వైరస్ కారణమని చెబుతున్నా అసలు కారణం అది కాదని అందరికీ తెలుసు.

 

మరి అసలు కారణం ఏమిటి ? ఏమిటంటే చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారమే కమీషనర్ నడుచుకుంటున్నాడన్నాడని జగన్ మీడియా సమావేశంలో చెప్పారు. ఇద్దరి సామాజికవర్గం ఒకటి కాబట్టే నిమ్మగడ్డను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నాడన్నది జగన్ , వైసిపి నేతల ఆరోపణ. ఇక్కడ సమస్య ఏమిటంటే కమీషనర్ మీద జగన్ చేసిన ఆరోపణలను కోర్టులో వినిపించలేరు. ఎందుకంటే అవేవీ వాదనలో నిలబడవు. కోర్టుకు కావాల్సింది టెక్నికల్ అంశాలు మాత్రమే.

 

ఇక్కడ టెక్నికల్ అంశం ఏమిటంటే కరోనా వైరస్ విజృంభణ మాత్రమే. కరోనా వైరస్ వల్ల జనాలకు ఇబ్బందులు వస్తాయేమోనని ముందు జాగ్రత్తగా ఎన్నికలను వాయిదా వేశానని ఎన్నికల కమీషన్ కోర్టులో చెబుతుంది. కమీషన్ చెప్పిన కారణాన్ని కోర్టు కూడా కాదనేందుకు లేదు. ఎందుకంటే ఇదే సమస్యతో  కోర్టులో విచారణలను కూడా జడ్జిలు వాయిదాలు వేసేస్తున్నారు. మరీ ముఖ్యమైన కేసులను కూడా వర్చువల్ పద్దతిలో అంటే ఏ వీడియో కాన్ఫరెన్సుల్లో విచారణ చేయమని స్వయంగా కోర్టులే చెబుతున్నాయి. కాబట్టి కమీషన్ నిర్ణయాన్ని తప్పు పట్టే అవకాశం లేదనే అనుకోవాలి. కాకపోతే ఎన్నికల వాయిదాను ఏకపక్షంగా చేయటమే ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం. వాయిదా ప్రకటన చేసేముందు కమీషనర్ ఎటువంటి సమీక్షలు చేయలేదన్నది వాస్తవం.  మరి ఈ పరిస్ధితుల్లో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏమి జరుగుతుందో ? 

మరింత సమాచారం తెలుసుకోండి: