కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా భారీన పడి 7,000 మంది మృతి చెందగా 1,75,000 మంది కరోనా బాధితులుగా ఉన్నారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కు చేరింది. తెలంగాణలో నిన్న మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 4కు చేరింది. ప్రపంచం మొత్తం కరోనా వల్ల నష్టపోతుంటే కొందరు మాత్రం లాభపడుతున్నారు. 
 
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ ఆదుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కరోనా వైరస్ మధ్య ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కమల్ నాథ్ కు మేలు చేసింది. నిన్న మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశించిన నేపథ్యంలో... కరోనా వల్ల స్పీకర్ సభను సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో సభను వాయిదా వేసినట్లు గవర్నర్ ప్రకటించారు. మంత్రి గోవింద్ సింగ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, రాజస్తాన్ రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని స్పీకర్ దృష్టికి తీసుకురాగా ఆయన సభ కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
మరోవైపు గవర్నర్ టాండన్ మాత్రం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ కమల్ నాథ్ కు మరో లేఖ రాశారు. విశ్వాస పరీక్ష జరగకపోతే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందని చెప్పారు. స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంను ఆశ్రయించారు. తక్షణమే బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈరోజు విచారించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: