ఏ విషయం ఎలాగున్నా ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశంపార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు  పూర్తిగా అనుసరిస్తున్నారు. ఈ మధ్య గుంటూరు జిల్లా మాచర్లలో బోండా, బుద్దా కారుపై జరిగిన దాడి అందరికీ గుర్తుంది కదా ? ఆ దాడికి సంబంధించి పై ఇద్దరు  నేతలు  డిజిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసింది వైసిపి నేతలే అంటూ కొందరి పేర్లను కూడా ఇచ్చారు.

 

సరే వీళ్ళ ఫిర్యాదు తర్వాత సంఘటనపై డిజిపి విచారణ చేయిస్తున్నాడు. గుంటూరు రేంజి ఐటి ఆధ్వర్యంలో మొదలై విచారణకు హాజరుకమ్మంటూ  పై ఇద్దరు నేతలకు పోలీసు అధికారులు నోటిసులిచ్చారు. ఇపుడా విచారణకు తాము హాజరయ్యేది లేదంటూ వీళ్ళు ఎదురు తిరిగారు. గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు జరిపే విచారణకు తాము హాజరయ్యేది లేదని చెప్పేశారు.

 

విచారణ పేరుతో తమను పోలీసులు చంపేసినా చంపేస్తారంటూ పెద్ద డ్రామా మొదలుపెట్టారు. గొడవ జరిగిన రోజేమో తమను డిఎస్పీనే కాపాడాడని వీళ్ళిద్దరే చెప్పారు. డిఎస్పి తన కారులో ఎక్కించుకుని కాపాడకపోతే తాము ఈ పాటికి చనిపోయుండే వాళ్ళమని మీడియా సమావేశంలోనే పదే పదే చెప్పారు. ఇపుడేమో పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని చెప్పటం డ్రామా కాకుండా మరేమిటి ? ఆరోజు వీళ్ళ ప్రాణాలు కాపాడిన పోలీసులు ఈరోజు ఎందుకు ప్రాణాలు తీసేస్తారు ?

 

పైగా జరిగిన ఘటనపై గుంటూరు పోలీసులతో కాకుండా సిబిఐతో మాత్రమే విచారణ చేయించాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. తాము ఫిర్యాదు చేయగానే ప్రత్యర్ధులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా బోండా పోలీసులను నిలదీస్తున్నాడు. టిడిపి నేతలిచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కాదా వీళ్ళ ఫిర్యాదులో చెప్పిన వాళ్ళకు పోలీసులు నోటీసులిచ్చింది ? అంటే వీళ్ళు చెప్పేదెలాగుందంటే వీళ్ళు ఫిర్యాదులు ఇవ్వగానే వెంటనే ప్రత్యర్ధులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపేయాలన్నట్లుంది.

 

టిడిపి హయాంలో కూడా నేతలు ఎంతోమంది అరచకాలకు పాల్పడ్డారు. ఎవరిపైనా ఫిర్యాదులు తీసుకోలేదు, ఎవ్వరిపైనా చర్యలూ లేవు. సరే మిగిలిన విషయాలు ఎలాగున్నా పోలీసు విచారణకు హాజరు కాకపోవటం, సిబిఐ విచారణకు డిమాండ్ చేయటం, హై కోర్టులో కేసు వేసే విషయంలో జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నట్లున్నారు టిడిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: