ఏపీలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనపై సీఎం జగన్ విమర్శలు చేయడం, సీఎస్ నీలం సాహ్ని ఎన్నికలు యథావిధిగా జరపాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లేఖకు స్పందించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను మూడు పేజీల లేఖలో పూర్తిగా వివరించారు. 
 
ఈ లేఖలో కొన్ని కీలక విషయాలను సైతం ప్రస్తావించారు. కరోనా ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సైతం స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. గతంలో తాను సైతం ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని... ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఆర్థిక సంఘం నిధులకు, ఎన్నికలకు లింక్ పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. 
 

కరోనాలాంటి కారణాల వల్ల ఎన్నికలను నిలిపివేసినా రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. గోవాలో సైతం ఎన్నికల వాయిదా గురించి చర్చలు జరుగుతున్నాయని... అక్కడ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 
 
కేంద్ర ఆరోగ్య - కుటుంబ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలను వాయిదా వేశామని అన్నారు. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఎన్నికల వాయిదా గురించి పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: