అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి పోటీకి ట్రంప్‌ రెడీ అవ్వగా....డెమొక్రాటిక్ పార్టీ నుంచి అభ్యర్ధులపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందుకోసం కీలకమైన ఎన్నికకు సర్వం సిద్దమైంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బరిలో ఉన్న జోయ్ బిడెన్, బెర్నీ సాండర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో....సూపర్ ట్యూజ్‌డే పై ఆసక్తి నెలకొంది.

 

అమెరికా46వ అధ్యక్షుని ఎన్నిక ఈ ఏడాది నవంబర్ జరుగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా రాజకీయాలలో కురువృద్ధ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా మరోమారు పోటీ చేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఇంత వరకు వివిధ స్టేట్ ప్రైమరీస్, కాకసస్ లో 1099 ప్రతినిధులను ట్రంప్ గెలుచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ పొందేందుకు ఆయనకు మొత్తం 1,276 ప్రతినిధి ఓట్లు అవసరం. ఆ మార్క్ చేరితే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిలుస్తారు.

 

డెమొక్రటిక్ పార్టీ విషయానికి వస్తే, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్న వారిలో ఈ ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తోంది. సూపర్ ట్యూజ్‌డే ప్రీమియర్స్‌, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడంతో బిడెన్ ముందంజలో ఉన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసే మొత్తం జాతీయ ప్రతినిధులలో మూడింట ఒక వంతు మంది , అంటే 1,344 మంది ఇక్కడి నుంచే ఎన్నికవుతారు. ఆ విధంగా  సూపర్‌ ట్యూజ్‌డే ప్రిమియర్ నిర్ణాయక పాత్రను పోషిస్తుంది. ఈ ప్రిమరీస్ లో ఎవరు ఎక్కవ మంది ప్రతినిధులను గెలుచుకుంటే వారు, అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అవుతారు.

 

ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల ఎంపిక పూర్తయిన తర్వాత....అసలు ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్ధులు దేశ వ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారం సాగిస్తారు. ర్యాలీలలో పాల్గొంటారు. చర్చలు సాగిస్తారు. దేశ వ్యాప్తంగా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు, ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అమెరికా ఎన్నికల్లో దేశ అధ్యక్ష,ఉపాధ్యక్షులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. పోలింగ్ పూర్తయిన తర్వాత, పోలైన ఓట్లను రాష్ట్రాల వారీగా లెక్కిస్తారు. వాషింగ్టన్ DC, 48 రాష్ట్రాలలో గెలిచిన అభ్యర్ధి రాష్ట్రంలోని ఓటర్ల అందరి మద్దతు పొందుతారు. అమెరికా అధ్యక్షడు కావాలంటే, పోటీలో ఉన్న అభ్యర్ధికి కనీసం 270 ప్రతినిధి ఓట్లను పొందవలసి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: