కరోనా ధాటికి యూరప్ దేశం స్పెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. ఇటలీ తర్వాత యూరప్‌లో కొత్త ఎపి సెంటర్‌గా స్పెయిన్ తయారైంది. ఈ దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న మరణాలతో.. లాక్ డౌన్ ప్రకటించారు. 15 రోజుల ఎమర్జెన్సీ విధించారు. 

 

యూరప్‌లో ఇటలీ తర్వాత స్పెయిన్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా కేసుల పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది స్పెయిన్. చైనాలో అత్యధిక కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా స్పెయిన్ లో కరోనా విలయ తాండవం చూస్తుంటే.. త్వరలోనే మరణాల సంఖ్య విషయంలో ఇటలీని దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 

 

యూరప్‌లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్పెయిన్‌దే. ఇక్కడ ఆటోమొబైల్ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోంది. జనసాంద్రత తక్కువే అయినా.. వయసుమళ్లిన వాళ్లు ఎక్కువగా ఉండటంతో.. ఈ దేశంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. స్పెయిన్‌లో జననాల రేటు కూడా తక్కువే. ఇక్కడి పౌరుల సగటు వయసు 43 ఏళ్లుగా ఉంది. 

 

స్పెయిన్లో మొత్తం 7వేల 753 కరోనా కేసులు నమోదు కాగా.. 288 మంది చనిపోయారు. ఒక్క రోజులోనే 2 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో.. ఈ దేశం వణికిపోతోంది. చైనా, ఇటలీ, ఇరాన్ కేసుల సంఖ్య పరంగా స్పెయిన్ కంటే ముందున్నప్పటికీ.. ఇక్కడ 24 గంటల వ్యవధిలోనే మల్టిప్లయర్ ఎఫెక్ట్ తో పెరుగుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఒక్క రోజులోనే స్పెయిన్ లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 34.7 శాతం పెరిగింది. చైనాలో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టగా, ఇటలీలో 16.8 శాతం, ఇరాన్ లో 9.8 శాతం మాత్రమే కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది.  స్పెయిన్ కరోనాకు కొత్త ఎపి సెంటర్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

ఏకంగా స్పెయిన్ ప్రధాని భార్యకు కరోనా రావడంతో.. అక్కడి ప్రభుత్వం అలర్టైంది. పదిహేను రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించింది. నిత్యావసరాలు, మందుల కొనుగోలు, ఆఫీస్ విధులకు మినహా మరి దేనికీ ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. బహిరంగ వేడుకలు, కార్యక్రమాలు అన్నీ రద్దయ్యాయి. పబ్ లు, రెస్టారెంట్లు, థియేటర్లు, వినోద కేంద్రాల్ని మూసేశారు. సాంస్కృతిక కేంద్రాలు, మ్యూజియాలు కూడా  మూతబడ్డాయి. ఇటలీ తర్వాత యూరప్‌లో స్పెయిన్‌లోనే లాక్‌డౌన్ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: