తాను ఏం చేసినా అదే క‌రెక్ట‌ని, తాను ప‌ట్టుకున్న కుందేటికి మూడే కాళ్ల‌ని చెప్పుకొని, స‌మ‌ర్ధించుకునే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఇప్పుడు కీల‌క‌మైన ప్ర‌శ్న వెంటాడుతోంది. రాష్ట్రంలో స్తానిక ఎన్నిక‌ల స‌మ‌రం కొన‌సాగుతోంది. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను అధికార ప‌క్షం త‌న‌కు అనుకూలంగా మార్చుకుంద‌ని, ఫ‌లితంగా ప్ర‌తిప‌క్షం అన్ని విధాలా న‌ష్ట‌పోతోంద‌ని చంద్ర‌బాబు అంటున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో కొన్ని చోట్ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న చూపిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో గుంటూరు, చిత్తూరుల్లోనే కొన్ని ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.



దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి. గుంటూరులో రాజ‌ధాని కోసం పోరాటం చేస్తున్నంద‌న తమ ఆధిప‌త్యం నిలుపుకొనేందుకు ఇక్క‌డి నాయ‌కులు పోటీ ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత‌లు, వైసీపీ నాయ‌కులు కూడా రెచ్చిపోయారు. దీంతో కొన్ని ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ఇక‌, చిత్తూరు చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డంతో అక్క‌డ కూడా టీడీపీ నాయ‌కులు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో త‌మ‌కు ప‌ట్టులేని నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులోనూ త‌మ్ముళ్లు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డారు. నిజానికి ఇలాంటి ప‌రిణామాలు గ‌తంలో 2013లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ చోటు చేసుకున్నాయి.



అయితే, ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు ఇవేవో కొత్త‌గా జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. పోనీ.. ఇదే అనుకున్నా.. దాదాపు 200 పైచిలుకు ఎంపీటీసీ స్థానాల్లోటీడీపీ ఏక‌గ్రీవం అయింది. అదేవిధంగా ప‌దుల సంఖ్య‌లో జెడ్పీ స్థానాల‌ను కూడా ఏక‌గ్రీవంగా త‌న ఖాతాలో వేసుకుంది. మ‌రి ఇది ఎలా సాధ్యం? అనేది చంద్ర‌బాబు చె ప్పాలి. ఒక‌ప‌క్క ప్ర‌భుత్వ నిర్బంధాలు కొన‌సాగుతున్నాయ‌ని చెబుతున్న ఆయ‌న .. మ‌రోప‌క్క‌, ఏక‌గ్రీవాల  విష‌యంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్ర‌భుత్వ నిర్బంధాలు కొన‌సాగి ఉంటే.. కేవ‌లం రెండు జిల్లాలు మాత్ర‌మే తెర‌మీదికి ఎందుకు వ‌స్తాయ‌నే విష‌యాన్ని కూడా చెప్పాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు మాట్లాడ‌తారా?  చూడాలి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: