భారతీయ వైద్య విద్యార్థులు మలేషియా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారు. ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఆ దేశ ప్రభుత్వం 72 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో 150 మంది భారతీయ వైద్య విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియా చేరుకున్నారు. అక్కడినుండి మన దేశానికి రావడానికి విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. కానీ ఇండియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు మలేషియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
మలేషియా ప్రభుత్వంతో మాట్లాడి తమను దేశానికి రప్పించేలా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థులు మలేషియాలో చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 6 గంటల నుండి విద్యార్థులు అక్కడ ఉన్నారని తెలిపారు. విద్యార్థులలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. 
 
ప్రభుత్వం అకస్మాత్తుగా విమానాలను ఆపేయటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులు సీఎం కేసీఆర్, కేటీఆర్ కు సోషల్ మీడియా ద్వారా ఇండియాకు తిరిగి రప్పించాలని చెప్పారు. పిల్లలు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హైదరాబాద్ లేదా చెన్నైకు స్పెషల్ ఫ్లైట్ వేస్తే విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల విషయంలో ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. మలేషియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం అన్ని విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 4 నమోదు కాగా... ఏపీలోని నెల్లూరులో ఒక కేసు నమోదైంది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: