ఉప ఎన్నికల వాయిదా అంశం ఎంత వివాదానికి దారితీసిందో అందరూ చూస్తున్నదే.  ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించేసిన ఎన్నికల వాయిదా అంశంలో జగన్మోహన్ రెడ్డి-నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య అగాధం పెరిగిపోయింది.  ఇంతకీ ఈ వివాదంలో  ఎవరిది తప్పు ? ఎవరిది ఒప్పు ? వాస్తవంగా ఆలోచిస్తే ఇద్దరిలోను తప్పున్న విషయాన్ని అంగీకరించాల్సిందే.

 

ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా వాయిదా వేయటం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పే. నిమ్మగడ్డ చెబుతున్న కరోనా వైరస్ కారణం అంత నమ్మేదిగా లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద బయటపడింది ఒకే ఒక్క కేసు మాత్రమే.  ఇంతోటి దానికి ఏకంగా ఎన్నికలనే వాయిదే వేసేయటం ధర్మం కాదు.

 

నిజంగా కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నా  ముందుగా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పరిస్ధితిని సమీక్షించాలి. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడాలి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ తర్వాతే ఎన్నికల కమీషన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి.  కానీ నిమ్మగడ్డ ఇవేమీ చేయకపోవటం ముమ్మాటికి తప్పే.

 

అదే సమయంలో నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే జగన్ కూడా వెనకా ముందు చూసుకోకుండా  రెచ్చిపోయాడు. నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్ళి తన నిరసనను తెలిపాడు. అంతటితో ఆగకుండా  మీడియా సమావేశం పెట్టి నేరుగా నిమ్మగడ్డను వ్యక్తిగతంగా టెర్గెట్ చేసి అనేక ఆరోపణలు  చేశాడు. నిమ్మగడ్డ  విషయంలో జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు కరెక్టే అనుకున్నా అవేవీ వాదనకు నిలబడేవి కావు.

 

నిమ్మగడ్డలోని తెలివి జగన్ లో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల్లో వైసిపి ఆరాచకాలు చేస్తోందని, దాడులు చేస్తోందని, బెదిరిస్తోందంటూ ఫిర్యాదులు చేసి ఎన్నికలను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల వాయిదాకు టిడిపి చేసిన ఫిర్యాదులను కాకుండా కరోనా వైరస్ ను మాత్రమే వాడుకున్నాడు. అంటే ఎన్నికల వాయిదాకు నిమ్మగడ్డ ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశాడో అర్ధమైపోతోంది.

 

కాబట్టి జగన్ కూడా ఆవేశానికి పోకుండా అంతే జాగ్రత్తగా ఆలోచించుండాలి. కరోనా వైరస్ అనే కారణం ఇపుడు ఎవరూ కాదనలేని వాస్తవం.  అందుకనే జగన్ కూడా కమీషనర్ నిర్ణయాన్ని సింపుల్ గా  స్వాగతించేసుంటే సరిపోయేది. ఎందుకంటే అన్నీ ఎన్నికలకు నామినేషన్లు అయిపోయాయి. చాలా చోట్ల ఏకగ్రీవాలైపోతున్నాయి. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఏమవుతుందో చెప్పలేం. ఈ మధ్యలో వైసిపికి జరిగే నష్టం కూడా ఏమీలేదు. ఎన్నికల కమీషనర్ తో  మాట్లాడుకుని ఇళ్ళపట్టాల పంపిణీకి అనుమతి తెచ్చేసుకునుంటే సరిపోయేది. ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు జరిగినా గెలిచేది వైసిపియే అనుకున్నపుడు కొద్ది రోజులు జగన్ ఓపిగ్గా ఉండుంటే సరిపోయేది. తెలివిగా డీల్ చేయాల్సిన అంశాన్ని ఆవేశంతో డీల్ చేయటం వల్ల చివరకు జగనే గబ్బు పట్టిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: