రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా టీఆర్ ఎస్ నుంచి అవ‌కాశం వ‌స్తుంద‌నుకున్న పొంగులేటి ఆశ‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నీళ్లు గుమ్మ‌రించారు. చివ‌రి నిముషం వ‌ర‌కు పొలిటిక‌ల్ స‌స్పెన్స్‌ను కొన‌సాగించి ఆఖ‌రికి అభ్య‌ర్థిత్వ అవ‌కాశాన్ని మాజీ స్పీక‌ర్ కె. సురేష్‌రెడ్డి చేతికి అంద‌జేశారు. దీంతో పొంగులేటి అనుచ‌రుల్లో ఆగ్ర‌హ‌వేశాలు క‌ట్ట‌లు తెచ్చుకుంటున్నాయ‌ట‌. పార్టీలో ఉంచుకుంటూ కావాల‌నే కారు పార్టీ అధిష్ఠానం మ‌న‌ల్ని అవ‌మానిస్తోందంటూ పొంగులేటితో అనుచ‌రులు వాపోతున్నారు. ఇలా అయితే మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం..జిల్లాలో రాజ‌కీయంగా ఉనికిని కోల్పోతామంటూ శ్రీనివాస‌రెడ్డికి అత్యంత స‌న్నిహితులైన కొంత‌మంది ప్ర‌ధాన అనుచ‌రులు ఆయ‌న‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయ్యార‌ని స‌మాచారం. 

 

 

ఈ క్ర‌మంలోనే పార్టీ మారేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌నపై ఒత్తిడి కూడా పెంచిన‌ట్లుగా ఖ‌మ్మం రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆయ‌న మాత్రం ఇప్ప‌ట్లో అవేం వ‌ద్దు అంటూ అనుచ‌రుల‌ను వారించిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీలో త‌ప్ప‌క గుర్తింపు ల‌భిస్తుంద‌ని, ఎవ‌రూ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌వ‌ద్దు అంటూ స‌ర్దిచెప్పార‌ట‌. అయితే ప్ర‌స్తుతానికైతే నాయ‌కుడి మాట తీసెయ్య‌కుండా ఆయ‌న సూచించిన మార్గంలోనే న‌డుస్తున్నా, అధిష్ఠానం, జిల్లా మంత్రి అజ‌య్‌, ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు, మాజీ మంత్రి తుమ్మ‌ల‌పై మాత్రం గుర్రుగా ఉన్నార‌ట‌. పొంగులేటికి రాజ్య‌స‌భ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డానికి ముగ్గురు ఒక్క స్వ‌రంతో అధిష్ఠానంపై ఒత్తిడి పెంచ‌డం వ‌ల్లే అలా జ‌రిగి ఉంటుంద‌న్న‌ది వారి కోపానికి కార‌ణంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. 

 

 

స‌మీప భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ప‌ద‌వులేవీ ద‌క్కే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో పొంగులేటి కూడా పార్టీ మార‌తాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయ‌న పార్టీ మారితే మాత్రం త‌ప్ప‌కుండా బీజేపీయే ఫ‌స్ట్ చాయిస్‌గా ఉంటుంద‌ని కూడా నొక్కి వ‌క్కాణిస్తు న్నారు. జిల్లాలో ఇప్ప‌ట్లో కాంగ్రెస్ కోలుకోని ప‌రిస్థితి ఉండ‌టం ఒక కార‌ణ‌మైతే.. వ్యాపారం, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో బీజేపీ వైపే ఆయ‌న మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా పొంగులేటిని పార్టీలోకి తీసుకువ‌స్తే జిల్లాలో పార్టీకి జ‌వ‌స‌త్వాలు తీసుకురావ‌చ్చ‌ని అదే స‌మ‌యంలో ఖ‌మ్మ సామాజిక వ‌ర్గానికి పోటీగా నేత దొరికిన‌ట్లేన‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం ఆయ‌న‌తో భేటీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: