కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా దెబ్బకు చికెన్ రేట్లు భారీగా తగ్గాయి. కొన్ని చోట్ల కోళ్లను ప్రజలకు ఉచితంగా పంచుతున్నారు. చికెన్ రేట్లు, కోళ్ల రేట్లు భారీగా తగ్గడంతో గత కొన్ని రోజులుగా కోళ్ల వ్యాపారులకు తీవ్రంగా నష్టాలు వెంటాడుతున్నాయి. కృష్ణా జిల్లాలో పౌల్ట్రీ వ్యాపారులు గత కొన్ని రోజులుగా నష్టాలు వెంటాడుతుండటంతో ప్రజలకు చికెన్ తింటే కరోనా రాదని అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కృష్ణా జిల్లా గూడూరు మండలం గండ్రమ్ గ్రామంలో చికెన్ కర్రీని వండి గారెలతో పాటు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సాయిగణేష్ చికెన్ సెంటర్ వ్యాపారులు గ్రామవ్యాప్తంగా ప్రతి ఇంటికి కిలో చికెన్ ను, గారెలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చికెన్ తింటే కరోనా రాదని ఇచ్చిన లేఖను ప్రజలకు చూపిస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. 
 
ఇలా ప్రతి ఇంటికీ చికెన్ ను పంపిణీ చేయడం ద్వారా ప్రజలు చికెన్ తింటే కరోనా రాదని విశ్వసిస్తారని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ కుదుటపడాలనే ఆలోచనతోనే తాము ఇలా ప్రజలకు చికెన్ ను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. గ్రామ ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోయాయని తాము భావిస్తున్నామని... వ్యాపారం పుంజుకుంటుందని అనుకుంటున్నామని తెలిపారు. 
 
చికెన్ తింటే కరోనా సోకనప్పటికీ కొందరు వెబ్, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయడంతో ప్రజలు ఈ వదంతులు నిజమని నమ్ముతున్నారు. ప్రభుత్వం చికెన్ తింటే కరోనా రాదని అవగాహన కార్యక్రమాలను కల్పించాలని... ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు. గతంలో తమకు ఎప్పుడూ ఇంత తీవ్ర స్థాయిలో నష్టాలు రాలేదని వ్యాపారులు చెబుతున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: