స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ ముదిరిపోయింది. ప్రతిదానికి సై అంటే సై అనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనే వీరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి వెళ్లింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎవరికి వారు తమ తమ అభ్యర్ధులని గెలిపించుకునేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నారు.

 

ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో పరిటాల శ్రీరామ్‌కు ఎదురుదెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనలో శ్రీరామ్ బుక్ అయ్యేలా ఉన్నారు. మామూలుగా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల, రాజకీయ నాయకులు విగ్రహాలు, పేర్లు ఉండే వాటికి ముసుగులు వేస్తారనే సంగతి తెలిసిందే. అయితే రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో స్వాగత ద్వారంపై ఉన్న పరిటాల రవి పేరును, అక్కడ అధికారులు తొలగించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ్ అధికారులని గట్టిగానే నిలదీశారు. కోడ్ ప్రకారం పేరుకు ఏదైనా ముసుగు వేయాలని, అలా కాకుండా పేరు ఎలా తొలగిస్తారని నిలదీశారు.

 

దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న పై అధికారులు ఎన్నికలు అవ్వగానే మళ్ళీ పేరు పెట్టిస్తామని చెప్పారు. అయితే శ్రీరామ్ అధికారులని నిలదీసే సమయంలో స్థానిక ఎం‌పి‌డి‌ఓపై భుజం మీద చేయి వేసి మాట్లాడారు. అలాగే తమ కార్యకర్తల సమావేశంలో ఎం‌పి‌డి‌ఓ, వైసీపీ నేతలపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఇక ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి స్పందిస్తూ, రామగిరిలో పరిటాల అరాచకాలు గమనించాలని, ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీవో కాలర్‌ని పట్టుకున్నారని.. శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలని చెబుతూ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

 

ఇక ఎస్పీ కూడా పరిటాల శ్రీరామ్‌పై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ వైపు వైసీపీ నేతలు నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో శ్రీరామ్‌ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని రాప్తాడులో చర్చ నడుస్తోంది. మరి చూడాలి పోలీసులు శ్రీరామ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: