ప్రపంచంలో అత్యంత ప్రమాదంగా మారిన   కరోనా వైరస్ భారత్ లోనూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 126 కాగా, ముగ్గురు మృతి చెందారు. వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తతతో అనేకమంది ప్రముఖులు స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. భారత్ లో కరోనా రెండో దశకు చేరుకుందని, ఇంకా సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతానికి కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులవుతున్నారని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, సెలెబ్రెటీలు ఏకరవు పెడుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ‘కరోనా’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు.  ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ లతో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్లబ్స్, పర్యాటక కేంద్రాలు ఇతర రద్దీ ప్రాంతాలు మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. 

 

అయితే కొంత మంది పాఠశాలల యాజమాన్యం ఈ ఆర్డర్ ని బేఖాతర్ చేస్తూ స్కూల్ యథావిదిగా నిర్వహించారు. దాంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంతే కాదు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే నిమిత్తం విద్యా సంస్థలు, పబ్ లు తాత్కాలికంగా మూసివేయాలన్న ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.

 

కరోనా’ నివారణకు ఆయా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, తమ ఉద్యోగులకు మాస్క్ లు, గ్లౌజ్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసిన 66 సంస్థలను సీజ్ చేసినట్టు జీహెచ్ఎంసీ ఈడీ విశ్వదత్ పేర్కొన్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించేందుకు 18 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: