చంద్రబాబు ఇప్పటికీ పాలిటిక్స్ లో నాటౌట్. జాతీయ రాజకీయాల్లో ఇంతలా బుర్ర పెట్టి ప్రతీ రోజూ రాజకీయాలు చేసే వారు ఎవరూ లేరు. బాబు వయసు ఇపుడు  డెబ్బయ్యేళ్ళు. అయినా సరే ఆయన దేశంలోని చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా చురుకు. ఆయన డైనమిజం చూసి అంతా అసూయ పడాల్సిందే. 

 

బాబుది సుదీర్ఘ రాజకీయం. ఆయన ముందు ఇపుడు ఏపీలోని జగన్ సహా ఇతర నేతలంతా చాలా జూనియర్లుగా చెప్పుకోవాలి. విద్యార్ధి రాజకీయాల నుంచి పాలిటిక్స్ వంటబట్టించుకున్న బాబు ఓ పట్టాన ఓటమిని అంగీకరించరు. ఒకవేళ ఓటమి వచ్చిన మళ్ళీ విజయం వైపుగా సాగేందుకు ఆయన నెక్స్ట్ సెకన్ నుంచే రెడీ అయిపోతారు.

 

ఓ విధంగా బాబులోని ఈ లక్షణాలు స్పూర్తివంతమైనవే. యువతరం ఆచరించదగినవే. అయితే బాబు ఎక్కువగా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుతో ఆయన లో ప్లస్సులు కూడా చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని ఘోర పరాభవం  గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో చవిచూశారు. అయినా పడిలేచిన కెరటంలా యువనేత జగన్ మీద ఆయన సై అంటున్నారు.

 

ఈ పది నెలలలో జరిగిన అనేక పరిణామాలు చూసుకుంటే వ్యూహాలు, ఎత్తుల పరంగా బాబు పై చేయి సాధించారని చెప్పాలి. అసెంబ్లీలో 151  మంది మెజారిటీ కలిగిన జగన్ సైతం బాబు ముందు ఓడిపోవాల్సివస్తోంది. అది అడ్డదారి రాజకీయం అనుకున్నా కూడా బాబు విజయమేనని అన్నవారూ ఉన్నారు. రాజకీయాల్లో గమ్యానికి చేరుకోవడమే ముఖ్యం తప్ప దారి అడ్డదారి  నిలువుదారి  ప్రధానం కాదని చాణక్యుడే  చెబుతాడు.అందువల్ల బాబు రాజకీయాన్ని తప్పుపట్టినా కూడా అది అనివార్యం అనే వారూ ఉన్నారు.

 

ఇక బాబు ఎంత చేస్తున్నా ఆయన పార్టీ ఈ పదినెలల్లో ఎత్తిగిల్లలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన వయసే.   మరో నాలుగేళ్ళ పైదాటితే కానీ ఏపీలో ఎన్నికలు లేవు. అప్పటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో. వయోభారం రిత్యా బాబు ఎలా ఉంటారో ఈ రకమైన సమీకరణలతోనే బాబుని చాలా మంది వీడి జగన్ పంచన చేరుతున్నారు. దాంతో పాటు లోకేష్ సమర్ధత మీద అనుమానంతో కూడా టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. 

 

ఓ విధంగా అదే జగన్ కి శ్రీరామరక్షగా ఉందని అంటున్నారు. ఏపీలో బాబుకు వయసు అయిపోవడం, సరైన ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల కూడా జగన్ దూకుడుగా వెళ్తున్నారన్న మాట కూడా ఉంది. బాబు వయసు ఓ పదేళ్ళు తక్కువ కనుక ఉండి ఉంటే ఈ పాటికి జగన్ నుంచి అధికారం ఎపుడో  జారిపోయేదన్న విశ్లేషణలూ ఉన్నాయి. మొత్తానికి బాబు ఎంత జగన్ని ఇబ్బంది పెట్టినా ఆయన మైనస్సులే జగన్ని నిలబెడుతున్నాయని కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: