కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నా కొద్దిపాటి జాగ్రత్తలతో దాని బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. వాటిని పాటిస్తే దాదాపు మీరు కరోనా నుంచి సురక్షితమనే చెప్పొచ్చు. అవేమిటంటే.. తరచూ సబ్బు, నీళ్లతో చేతుల్ని 40 సెకెన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్లతో అయితే 20 సెకెన్ల పాటు శుభ్రంచేసుకోవాలి.

 

 

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా చీదినప్పుడు హ్యాండ్‌ కర్చీఫ్‌ కానీ టిష్యూ పేపర్‌ కానీ మోచేయిని అడ్డంగా పెట్టుకోవాలి. టిష్యూలను వాడిన వెంటనే వాటిని చెత్తబుట్టలో పడేయాలి. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించేటప్పుడు ముఖానికి మాస్క్‌ లేదా ఏదైనా వస్త్రాన్ని ముఖానికి కట్టుకోవాలి.

 

 

కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటే గనక కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన 011-23978046కు ఫోన్‌ చేయాలి. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా ఉన్నా.. అనుమానంగా ఉన్నా.. ఆ వ్యక్తిని ఆ రోజు నుంచి 14 రోజుల పాటు క్వారెంటైన్‌ చేయాలి. ఇది ఎలా అంటే.. బాధితులను బాగా వెలుతురు ఉండే గదిలో ఉంచాలి. ఆ గదికి అటాచ్‌డ్‌ టాయిలెట్ ఉండేలా చూడాలి.

 

 

బాధితుడితో పాటు కుటుంబ సభ్యులెవరైనా ఉండాలనుకుంటే ఇద్దరి మధ్యా కనీసం మీటర్‌ దూరం పాటించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులతో పాటు ఇంట్లో అనారోగ్యంతో ఎవరైనా ఉంటే బాధితులకు దూరంగా ఉండాలి. కరోనా లక్షణాలు ఉన్నవారి కదలికలను నియంత్రించాలి. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాగ్రత్త వహించాలి.

 

 

కరోనా అనుమానిత వ్యక్తులు సబ్బు, నీళ్లతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆల్కాహాల్‌తో తయారుచేసిన శానిటైజర్లను వాడాలి. ఇంట్లో వాడే వస్తువులకు దూరంగా ఉండాలి. సర్జికల్‌ మాస్క్‌లను ఎల్లప్పుడూ వాడాలి. మాస్క్‌ను 6 - 8గంటలకు ఒకసారి మార్చాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: