తెలుగుదేశం పార్టీ కి మరొక షాక్ తగలనుంది . ఆ పార్టీ కి చెందిన మరొక ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పనున్నారు . పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై  మండలి  లో చర్చ సందర్బంగా టీడీపీ విప్ జారీ చేసిన సమావేశాలకు  హాజరుకాకుండా దూరంగా ఉన్న శమంతకమణి తన కూతురు , అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యామినీబాలతో కలిసి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు .

 

బుధవారం కూతురు తో కలిసి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో ఆ పార్టీ లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనుచరులతో కలిసి శమంతకమణి , యామినీబాల లు అనంత నుంచి  విజయవాడ కు బయలుదేరినట్లు సమాచారం . గత కొన్ని రోజులుగా శమంతకమణి , యామినీబాల లు టీడీపీ వీడడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది . అయితే ఎక్కడ కూడా వీరు , ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు . దీనితో తల్లి , కూతుళ్లు ఇద్దరు టీడీపీ వీడి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయమన్న అంచనాకు తెలుగుతమ్ముళ్లు వచ్చారు . ఇక వరుసగా ఒకరి తరువాత మరొకరు టీడీపీ ని వీడుతుండడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది .

 

అయితే పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఏదో రకంగా లబ్ది పొందినవారే , పార్టీ కష్టకాలం లో ఉన్న సమయం లో తమ దారి తాము చూసుకుంటున్న తీరుపై పార్టీ క్యాడర్ అగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు . శమంతకమణి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టగా , ఆమె కూతురుకు గతం లో శింగనమల టికెట్ ఇచ్చి పార్టీ నాయకత్వం ప్రోత్సహించిందని గుర్తు చేస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: