దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,00,000 మంది కరోనా భారీన పడ్డారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ బంద్ చేయాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 
 
కరోనాను తగ్గించడానికి పారాసిటమాల్ వాడాలంటూ కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్, జగన్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. సీఎంలు చేసిన ఈ ప్రకటనలపై ఇరు రాష్ట్రాలలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏపీ డాక్టర్లు సీఎంలు పారాసిటమాల్ గురించి చేసిన ప్రకటనలపై స్పందించారు. కరోనా వైరస్ పై విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు తగిన సూచనలు చేశారు. 
 
కరోనా భారీన పడిన వారిలో మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వైరల్ జ్వరాలకు డాక్టర్లు పారాసిటమాల్ టాబ్లెట్ నే మొదట సూచిస్తారని అన్నారు. పారాసిటమాల్ ఉపయోగించిన తరువాత యాంటీ బయోటిక్స్ వాడటం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వైరస్ కు ఖచ్చితమైన మందులు లేకపోవడంతో వ్యాధి లక్షణాలను బట్టి మందులు సూచిస్తామని తెలిపారు. కరోనా వల్ల ప్రారంభమయ్యే జ్వరంకు పారాసిటమాల్ ఎంతో చక్కగా పని చేస్తుందని చెప్పారు. 
 
వైద్యులు విజయవాడ ఆస్పత్రిలో కరోనా బాధితులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని... ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని అన్నారు. పది ఐసోలేషన్ వార్డులను విజయవాడలో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నాంచారయ్య తెలిపారు. మధుమేహం ఉన్నవారిపై, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వైరస్ ప్రభావం ఉన్నవారికి పారాసిటమాల్ ఇస్తే వ్యాధి తీవ్రత తగ్గుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: