మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈరోజు ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండగా కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ నుండి ఎంతోమంది ఆశావహులు నిజామాబాద్ టికెట్ ఆశించినా కేసీఆర్ మాత్రం కవిత వైపే మొగ్గు చూపారు. 
 
మొన్నటివరకు కవితను కేసీఆర్ రాజ్యసభకు పంపించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా ఆమెకు అవకాశం దక్కలేదు. కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనతోనే కేసీఆర్ ఆమెను రాజ్యసభకు పంపలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కవిత నామినేషన్ పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. 
 
కవిత గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలవ్వటంతో అప్పటినుండి ఆమె పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఓడిన నిజామాబాద్ నుండే కవితను పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడే అధికారిక ప్రకటనతో పాటు నామినేషన్ చకచకా జరిగిపోతాయని తెలుస్తోంది. 
 
కేసీఆర్ కవితను కేబినెట్ లోకి తీసుకుంటే తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా ఆమె రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా కవిత పోటీ చేస్తూ ఉండటంతో ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారటంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అందువల్ల ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది చర్చల తరువాత పార్టీ నేతలతో కవితను ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారని సమాచారం. ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022, జనవరి 4న ముగియనుంది. కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నా కవిత ఇబ్బంది లేకుండా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: