బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎంపిక ఆ పార్టీ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్‌కు క‌లిసి రానుందా..?  పార్టీ ప్ర‌తినిధులుగా హిందుత్వ వాదాన్ని బ‌లంగా వినిపించే నేత‌ల‌కు ఆయ‌న అండ‌గా నిల‌వ‌నున్నారా..?, సంజ‌య్ ఎంపిక‌లో రాజాసింగ్ అభిప్రాయం కూడా కీల‌క‌మైందా..?,  రెడ్డి సామాజిక వ‌ర్గానికి పార్టీలో పెద్ద‌పీట ద‌క్క‌కుండా చేయ‌డంలో ఆయ‌న స‌ఫ‌లీకృతం అయ్యారా..?  హిందుత్వ భావ‌జాలాన్ని న‌ర‌న‌రానా జీర్ణించుకుని ఉన్న రాజాసింగ్‌కు అధిష్ఠానం వ‌ద్ద‌, ముఖ్యంగా అమిత్ షా వ‌ద్ద ప‌ర‌ప‌తి పెరిగిందా..? అంటే ఆ పార్టీ ముఖ్య నేత‌ల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. 2024లో తెలంగాణలో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ బ‌హుముఖ వ్యూహాల‌తో ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది.

 

అందుకోసం పార్టీని మారుమూల ప‌ల్లెల్లోకి కూడా విస్తృతం చేయాల‌ని భావిస్తోంద‌ని స‌మాచారం. పార్టీ విస్తృత చ‌ర్య‌ల్లో భాగంగా త్వ‌ర‌లోనే నూత‌న రాష్ట్ర క‌మిటీలు, జిల్లా, మండ‌ల, గ్రామ క‌మిటీల నియామ‌కం చేప‌ట్టనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇంత‌కంటే ముందే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి న‌డుం బిగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌మీప భ‌విష్య‌త్‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యం కూడా ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. గ్రేట‌ర్‌లో పార్టీ బ‌ల‌ప‌డాలంటే రాజాసింగ్‌కు న‌గ‌ర అధ్య‌క్షుడి ప‌ద‌వి అప్ప‌గించాల‌ని భావిస్తోంద‌ని స‌మాచారం. అదే జ‌రిగితే పార్టీలోని పాత‌త‌రం నేత‌ల‌కు ఇక పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాల నుంచి అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. 

 

వాస్త‌వానికి  రాజాసింగ్‌కు తాజామాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌, కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డికి చాలాకాలంగా విభేధాలున్నాయి. దీంతో ప‌లుమార్లు వీరిద్ద‌రిపైనా నేరుగా రాజాసింగ్ విమ‌ర్శ‌లు చేశారు. అంతే వాడిగా వారిద్ద‌రి నుంచి ప్ర‌తిస్పంద‌న ఎదురైంది. అయితే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. దీనికితోడు ఆయ‌నకు హిందుత్వ‌వాదుల్లో, యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విష‌యాన్ని అధిష్ఠానం ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌కు బండి సంజయ్‌కు మ‌ధ్య స‌త్సంబంధాలుండ‌టం కూడా ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సమాచారం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో రాజాసింగ్ కంటే స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉండ‌బోద‌ని కూడా అధిష్ఠానం భావిస్తున్న‌ట్లు పార్టీ నేత‌ల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: