మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి జనం అఖండ మెజారిటీ కట్టబెట్టారు. యువకుడైన జగన్ రాష్ట్రానికి మేలు చేస్తారని భావించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలపై నమ్మకంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వనంత భారీ మెజార్టీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక జగన్ కూడా తన ఎన్నికల హామీలను నెరవేర్చేపనిలో పడ్డారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ రాజకీయంగా వైసీపీ నేతల చర్యలు కొన్ని జనానికి వెగటు పుట్టిస్తున్నాయి.

 

 

ముఖ్యంగా కొందరు నాయకులు చేసే వ్యాఖ్యలు.. వైసీపీ కి బాగా డ్యామేజ్ గా మారాయి. ప్రస్తుతం వైసీపీకి జానాదరణ ఉందన్న సంగతి వాస్తవమే. కానీ ఆ ప్రజాదరణ ఎల్లకాలమూ అలాగే ఉంటుందని.. మనం ఏంచేసినా జనం ఆదరిస్తారని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇటీవల కొందరు వైసీపీ నాయకుల వ్యవహారం చూస్తే.. వైసీపీ జనాదరణ వేగంగా కోల్పోవడం ఖాయం అనిపించకమానదు.

 

 

మొన్నటి మాచర్ల ఘటనలో నడిరోడ్డుపై ఓ పెద్ద కర్ర తీసుకుని టీడీపీ నాయకులపై చేసిన దాడి వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. నోటికి హద్దూ పద్దూ ఉండటం లేదు. మీడియా ముందు మాట్లాడే సమయంలో కనీస భాషా సంస్కారం సంగతి కూడా మర్చిపోతున్నారు.. కుక్క, నక్క, గాడిద, గబ్బిళం అంటూ విరుచుకుపడుతున్నారు. ఇంకొందరు.. నోటికి అన్నం తింటున్నావా.. పెంట తింటున్నావా అంటూ మీడియా ముందే రెచ్చిపోతున్నారు.

 

 

టీడీపీ నేతలు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తేనే తట్టుకోలేక జనం వైసీపీకి అధికారం కట్టబెట్టారు. ఆ విషయం వైసీపీ నేతలు మరచిపోకూడదు. మరో కీలక విషయం.. మీడియాలో ఇప్పటికీ చంద్రబాబు చాలా సమర్థుడు.. అందుకే ఎక్కడ తేడా వచ్చినా దాన్ని బాగా హైలెట్ చేయడంతో ఆయన టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండకపోతే.. అది ఆ పార్టీకి ఏమాత్రం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: