తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసిపిలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తనను మోసం చేసిన కారణంగానే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన విషయం అందరూ చూసిందే. ఇంతకీ చంద్రబాబు చేసిన మోసం ఏమిటయ్యా అంటే మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదట. టికెట్ ఇస్తానని చెప్పటం తర్వాత ఇవ్వలేకపోవటం చాలా పార్టీలో సహజమే.

 

సరే టికెట్ విషయంలో మాట ఇచ్చి తప్పటమే చంద్రబాబు చేసిన మోసం అనే అనుకుందాం. మరి గాదె చేసిన మోసం మాటేమిటి ?  కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేయటం గాదె చేసిన మోసం కాదా ?  దశాబ్దాల పాటు గాదె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లాలో మరో నేతకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు పార్టీ గాదెకు ఇచ్చింది. 1967-2014 మధ్యలో గాదె వెంకట్రెడ్డి దశాబ్దాల పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేశారు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుండి మొదట పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొమ్మిది సార్లు పోటి చేశాడు. ఆరుసార్లు ఓడిపోయాడు. అంటే ఈయన ఏస్ధాయి ప్రజాబలం ఉన్న నేతో అందరికీ అర్ధమవుతోంది. తర్వాత రెండుసార్లు బాపట్ల అసెంబ్లీ  నుండి గెలిచాడు లేండి. రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఎన్నిసార్లు పోటి చేసి ఓడిపోయినా పార్టీ ఈయనే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందన్న విషయం అర్ధమైపోతోంది. మధ్యలో ఎంఎల్సీగా కూడా చేసినట్లున్నాడు.

 

మామూలుగా ఏ పార్టీ కూడా ఒకటి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన నేతను అధిష్టానం పక్కన పెట్టేయటం చూస్తునే ఉన్నాం. కానీ గాదె మాత్రం వరుసగా ఐదుసార్లు ఓడిపోయినా ఆయనకే టికెట్టిచ్చింది.  అలాంటి పార్టీ 2014లో రాష్ట్ర విభజన చేసిన తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  తన అనుభవాన్ని ఉపయోగించి కష్టకాలంలో ఉన్న పార్టీని ఆదుకోవాల్సిందిపోయి పార్టీని వదిలేశాడు. దీన్ని పార్టీని మోసం చేయటమనరా ? అంటే తాను తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని మోసం చేయొచ్చు కానీ తనను మాత్రం చంద్రబాబు మోసం చేయకూడదా ? ఇక్కడే గాదె ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతోంది. కాబట్టి గాదె కాంగ్రెస్ కు చేసిన మోసానికి ఈయనకు చంద్రబాబు చేసింది సరిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: