అవును మామూలుగా 1+1=2 అని లెక్కలో చెబుతారు. కానీ రాజకీయాల్లో మాత్రం  1+1= 2 అవ్వాలని ఏమీ లేదు. జీరో కూడా కావచ్చు. ఇపుడు బిజెపి+జనసేనలు పొత్తు పెట్టుకున్నా జరిగిందిదే. అంటే పై పార్టీలు విడివిడిగా ఉన్నా కలిసినా జరిగిన ఉపయోగం మాత్రం ఏమీ లేదనే అర్ధమవుతోంది. రెండు పార్టీలు కలిపి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దున్నేయటం మాటంచితే అసలు నామినేషన్లు కూడా వేయలేకపోవటం నిజంగా సిగ్గు చేటే. ఎన్నికలకు ముందు పై పార్టీల నేతలు చెప్పిన మాటలకు ఇపుడు జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తెలిసిపోయింది.

 

కొద్ది కాలం క్రితం తమ రెండు పార్టీలు కలిస్తే వైసిపి బాక్స్ బద్దలైపోవటం ఖాయమన్నట్లే మాట్లాడాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తీరా చూస్తే ఎవరి బాక్స్ బద్దలైందో అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే 652 జడ్పిటిసిలు, 9696 ఎంపిటిసిలతో పాటు వేలాది మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగితే అన్నీ చోట్లా నామినేషన్లు వేయటానికి రెండు పార్టీలకు  అభ్యర్ధులే దొరకలేదు.

 

వేసిన నామినేషన్లు కూడా ఏదో మొక్కుబడిగా వేసినవే అని అర్ధమైపోతోంది. కనీసం నామినేషన్లను కూడా వేయలేని పార్టీల నేతలు ముందు  ఏ స్ధాయిలో ప్రగల్బాలు పలికారో అందరూ చూసిందే. నామినేషన్లు కూడా వేయలేని పార్టీలు కూడా తమ అభ్యర్ధులను వైసిపి నేతలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని నానా యాగీ చేస్తున్నారు.

 

ఇంతోటి దానికి ఎన్నికలను రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో, కేంద్ర బలగాల భద్రతలో మళ్ళీ ఎన్నికలను జరపాలని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ఇక పవన్ వార్నింగులకైతే అంతే లేదు. మొత్తానికి రెండు పార్టీలు కలిసిన తర్వాత వాటి బలమెంతో అందరికీ తెలిసిపోయింది. రేపు ఏ ఎన్నికలు జరిగినా వీటి బలం ఇంతకన్నా పెరిగదన్న విషయం అర్ధమైపోయింది. కాబట్టి తమ పార్టీల బలమేంటో తెలుసుకుని మాట్లాడితే నేతలకు కాస్త గౌరవంగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: