రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క‌టే ఉత్కంఠ‌.. ఆరు వారాల పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంపై రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ చ ర్చించుకుంటున్నారు. దేశంలో క‌రోనా విజృంభిస్తోంద‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త‌గా వాయిదా వేస్తున్నామ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప్ర‌క‌టించారు. అయితే, దీనిపై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ప్ర‌క‌ట‌న న్యాయ స‌మీక్ష‌కు నిలుస్తుందా?  లేదా? అనేది కూడా సందేహంగా మారింది. ఒక ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం చేశామ‌ని చెబుతోంది. ఇప్ప‌టికే అంద‌రినీ శిక్ష‌ణ ఇచ్చామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి కూడా రాజుకుంద‌ని, ప్ర‌జ‌లు కూడా ఉత్సాహంగా ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఈ నేప‌థ్యంలో వాయిదా వేయ‌డం స‌రికాద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.



ఇక‌, ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యంపై కొంద‌రు హైకోర్టుకు వెళ్ల‌గా.. ప్ర‌భుత్వం నేరుగా సుప్రీం కోర్టు త‌లుపు త‌ట్టింది. ఎన్ని క‌ల వాయిదా ను ర‌ద్దు చేయాల‌ని, య‌దాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని కోరింది. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని కూడా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకుంద ని, అదేస‌మ‌యంలో ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేస్తున్నామ‌ని, ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని, ఈ స‌మ‌యంలో క‌రోనా ను అడ్డు పెట్టి వాయిదా వేయ‌డం స‌రికాద‌ని ఆమె వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో అటు న్యాయ వ్య‌వ‌స్థ‌, ఇటు రాజ‌కీయంగా కూడా ఈ విష‌యాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ప్ర‌తిప‌క్షం స‌హా కొన్ని పార్టీలు వాయిదా కోరుతుండ‌గా.. అధికార ప‌క్షం మాత్రం వాయిదాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.



ఈ క్ర‌మంలో క‌రోనా వ‌ర్సెస్ ఎన్నిక‌లు విష‌యం కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు అటు సుప్రీం కోర్టు, ఇటు హైకోర్టులు ఈవిష‌యం లో ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డిస్తాయ‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ.. చేసిన ప్ర‌క‌ట‌న‌లోని లోతుపాతులు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల వాయిదాకు ర‌మేశ్ కుమార్ చెప్పిన కార‌ణం క‌రోనా! నిజానికి ఇది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం. అదేస‌మ‌యంలో ఎంత‌గా విచ‌క్ష‌ణ అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. ఇలాంటి విష‌యాల్లో నిర్ణ‌యం తీసుకునే వెసులుబాటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ఎక్క‌డ ఉంటుంద‌నేది కూడా నిపుణుల మాట‌.



ప్ర‌భుత్వం లేదా స్వచ్ఛంద సంస్థ‌లు లేదా ప్ర‌జ‌లు, లేదా ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేసిన‌ప్పుడో .. లేదా ప్ర‌జ‌లు క‌రోనా వంటి వైర‌స్‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డి ఇంటి నుంచి కూడా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డి ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి లేన‌ప్పుడో ర‌మేశ్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యానికి బ‌లం చేకూరి ఉండేద‌ని ఎన్నిక‌ల సంఘాల్లో గ‌తంలో ప‌నిచేసిన అధికారులు అంటున్నారు.అదే స‌మ‌యంలో ప్ర‌జారోగ్యం అనేది రాష్ట్రాల జాబితాలో పూర్తిగా సీఎం... సంబంధిత మంత్రి చేతిలో ఉండే అంశం. దీనిలోకి ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. కేవ‌లం శాంతి భ‌ద్ర‌త‌లు, లేదా ఎన్నిక‌ల విష‌యానికే ఆ సంస్థ ప‌రిమితం కావాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.



మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. ఇలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను చూపిస్తూ.. వాయిదా వేసేముందు సంబంధిత శాఖ‌తోకానీ, ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 1 అధికారిగా ఉన్న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో కానీ క‌మిష‌న‌ర్ చ‌ర్చించాలి. కానీ, ర‌మేశ్ కుమార్ అలా చేయ‌లేదు. సో.. ఇలా మొత్తంగా చూస్తే.. ర‌మేశ్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యంలో లోటు పాట్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది న్యాయ‌స‌మీక్ష‌కు వీగిపోవ‌డం ఖాయ‌మ‌ని కూడా చెబుతున్నారు. ఇక జ‌గ‌న్ జోరుకు ఎలా బ్రేకులు వేయాల‌నుకున్నా తాను ఆడాల్సిన అస‌లు ఆట ఇప్పుడు మెద‌లు పెడ‌తాడ‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: