క‌రోనా వంటి డేంజరస్ వైర‌స్‌లు ఈ భూమి మీద చాలా వ్యాపించాయి. కోట్ల మందిని బ‌లి తీసుకున్నాయి. ఆ మధ్య వచ్చిన ఎబోలా కావచ్చు.. నిన్న వచ్చిన నిఫా కావచ్చు... మధ్య మధ్యలో జనాన్ని వణికించిన స్వైన్​ ఫ్లూ లాంటివి అనేకం ఉన్నాయి. ఇప్పటి వ‌ర‌కు ప్రపంచాన్ని వ‌ణికించిన భ‌యంక‌ర‌మైన వైర‌స్‌లు ఏంటో చూద్దాం.

 

1346 నుంచి 1353 వ‌ర‌కు ప్లేగు వ్యాధి భారీగా జ‌న‌న‌ష్టానికి కార‌ణ‌మైంది. ఏషియా, ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరించింది. సుమారు 20 కోట్ల మంది ఈ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించింది. ఆసియాలో మొదలై.. యూరోప్‌, ఆఫ్రికాకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైంది.. ప్లేగు వ్యాధే. 

 

క‌లరా వ్యాధి ప్రపంచంలో ఇప్పటి వ‌ర‌కు ఏడుసార్లు వ్యాపించింది. అయితే 1852 నుంచి 1860 మ‌ధ్య వ్యాపించిన మూడో క‌ల‌రా వ్యాధి భ‌యంక‌రంగా విస్తరించి కోట్ల మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆసియా, యూరోప్‌, ఉత్తర అమెరికా, ఆఫ్రికాకు ఈ వ్యాధి విస్తరించింది. నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంద‌ని లండ‌న్‌కు చెందిన జాన్ స్నో అనే ప‌రిశోధ‌కుడు గుర్తించాడు. ఈ వ్యాధి వ‌ల్ల ప్రపంచ‌వ్యాప్తంగా ఒక కోటి మంది మ‌ర‌ణించార‌ని లెక్కలు చెబుతున్నాయి. 1919 - 1911 మ‌ధ్య క‌లరా వ్యాధి ఆరోసారి విజృంభించింది. భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఈ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. భార‌త్‌లోనే సుమారు 8 ల‌క్షల మంది ఈ వ్యాధి వ‌ల్ల చ‌నిపోయార‌ని లెక్కలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరోప్‌, ర‌ష్యాలో కూడా ఈ వ్యాధి విస్తరించింది. అప్పటికే క‌లరా వ్యాధిపై ప‌రిశోధ‌న‌లు చేసిన అమెరికా ఈ వ్యాధిని నియంత్రించ‌గ‌లిగింది. దీంతో అమెరికాలో కేవ‌లం 11 మంది మాత్రమే ఈ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత క‌లరా వ్యాధి అంత‌రించిపోయింది.

 

1889 - 1890 మ‌ధ్య ఫ్లూ ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించింది. ఈ వైర‌స్‌ను ఏషియాటిక్ ఫ్లూ లేదా ర‌ష్యన్ ఫ్లూ అని పిలుస్తారు. 1889 మేలో త‌ర్కెస్తాన్‌, కెనడా, గ్రీన్‌ల్యాండ్ దేశాల్లో ఈ వైర‌స్‌ను గుర్తించారు. అప్పుడ‌ప్పుడే ప‌ట్టణీక‌ర‌ణ జ‌రుగుతుండ‌టం, ప‌ట్టణాల్లో జనాభా ఎక్కువ కావ‌డం వ‌ల్ల ఈ వైర‌స్ న‌గ‌రాల్లో ఎక్కువ విస్తరించింది. ప్రపంచ‌వ్యాప్తంగా సుమారు 10 ల‌క్షల మంది ఈ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించార‌ు. 1956లో చైనాలో పుట్టిన ఈ ఏషియ‌న్ ఫ్లూ రెండేళ్ల పాటు విజృంభించింది. చైనాతో పాటు సింగ‌పూర్‌, హాంగ్ కాంగ్‌, అమెరికాలో ఈ వైర‌స్ వ‌ల్ల ఎక్కువ మంది మ‌ర‌ణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 20 ల‌క్షల మంది ఈ వైర‌స్ వ‌ల్ల మృత్యువాత ప‌డ్డారు. అమెరికాలోనే 69,800 మంది ఈ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించారు.

 

1976లో కాంగో దేశంలో మొద‌టిసారి హెచ్ఐవీని గుర్తించారు. త‌ర్వాత ఈ వ్యాధి ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటి వ‌ర‌కు హెచ్ఐవీ వ‌ల్ల మూడున్నర కోట్ల మంది మ‌ర‌ణించార‌ు. మ‌రో మూడు కోట్ల మంది హెచ్ఐవీతోనే వ్యాధి బారిన ప‌డి జీవిస్తున్నారు. 2005 నుంచి ప్రపంచ‌వ్యాప్తంగా హెచ్ఐవీ ప్రభావం త‌గ్గుతూ వ‌స్తోంది. హెచ్ ఐవీ వైరస్ లో అనేక రకాలున్నాయి. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తిని తిప్పికొట్టడానికి హెచ్ఐవీ రకరకాలుగా మార్పులు చెందుతుంది. 

 

ఆఫ్రికా దేశాల్లో పుట్టి  అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టించిన ప్రమాదకర వ్యాధి.. ఎబోలా. ఇది ఒక డేంజరస్ వైరస్. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్ కు పెట్టారు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది. ఎబోలా వైరస్ ను 1976లో తొలిసారి గుర్తించారు.  2013 నుంచి 2016 వరకు పశ్చిమాఫ్రికాలో ఈ వైరస్​ బాగా విస్తరించింది. ఎబోలా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా సలైవా ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

 

జికా వైరస్ దోమ కాటు ద్వారా మనుషుల్లో వ్యాప్తి చెందింది. ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. ఆఫ్రికా నుంచి  ఈ వైరస్.. క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది. 1960లోఆఫ్రికాలో మొట్ట మొదట ఇది మనిషికి సోకినట్టు గుర్తించారు. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు. జికా వైరస్​ 2017లో మన దేశాన్ని తాకింది. మొదట రాజస్థాన్​లోని జైపూర్​లో దీని తీవ్రతను గుర్తించారు. దాదాపుగా 100మంది వరకు జికా బారినపడ్డారు. పొరుగున ఉన్న గుజరాత్​లోనూ ఇది ఎఫెక్ట్ చూపించింది. భారత్ బయోటెక్ సంస్థ.. దీనికి వ్యాక్సిన్ కనుగొంది. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. నిపా వైరస్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న జునోసిస్. అంటే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వైరస్. దీన్ని మొదటిసారి మలేషియా, సింగపూర్ లో 1998లో గుర్తించారు. ఈ వైరస్ కారణంగా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో 40శాతం మంది చనిపోయారు. రెండేళ్ల క్రితం నిఫా వైరస్​ కేరళలో చాలా ఎక్కువగా సోకింది. ఈ వైరస్​ మలేసియా, సింగపూర్​లలో వందలాది మందిని బలి తీసుకుంది. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్​లోకి, అక్కడినుంచి పశ్చిమ బెంగాల్​లోకి ప్రవేశించింది. 

 

2009లో హెచ్-1, ఎన్-1 వైరస్ వల్ల 6 వేల మందికి పైగా చనిపోయారు. 1918లో స్పానిష్ ఫ్లూ, 1956లో ఏషియన్ ఫ్లూ, 1968లో హాంకాంగ్ ఫ్లూలతో లక్షల మంది మృతిచెందారు. ప్రధానంగా 1956లో చైనాలో పుట్టిన ఈ ఏషియన్ ఫ్లూ రెండేళ్ల పాటు విజృంభించింది. చైనాతో పాటు హాంకాంగ్, సింగపూర్, అమెరికాలో ఈ వైరస్ వల్ల ఎక్కువ మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 20 లక్షల మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: