యూరప్‌లో కరోనా వేగంగా విస్తరిస్తున్న ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో కఠినమైన నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పది మందికి మించి ఎక్కడా గుమిగూడకుండా నిబంధనలు తెచ్చారు. దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారు అంత్యక్రియలకు కూడా నోచుకోవడం లేదు. దీంతో కరోనా మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు కార్చడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

 

యూరప్ లో కరోనాకు ఫస్ట్ ఎపి సెంటర్ ఇటలీ. ఆ దేశంలో విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, విహార కేంద్రాలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. ప్రముఖ పర్యాటక స్థలాలు, ప్రఖ్యాత కట్టడాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇటలీలో కరోనా భయం ఏ రేంజ్ లో ఉందంటే.. కనీసం పక్కింటివారితో మాట కలపడానికి కూడా జనం జంకుతున్నారు. ఇప్పుడు కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా కష్టం వచ్చి పడింది. సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేయడానికి కూడా కుదరడం లేదు. దీంతో మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

నిజానికి బతికున్న మనిషి కంటే శవానికే ఎక్కువ గౌరవం ఇస్తారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగకపోతే ఆత్మ సంతృప్తి చెందదనే నమ్మకాలు.. అన్ని దేశాలు, అన్ని మతాల్లో ఉన్నాయి. ఇటలీలో ఎక్కువమంది క్యాథలిక్కులు కాబట్టి.. అక్కడ చర్చి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియల్లో బంధువులు, దగ్గరివాళ్లు, స్నేహితులు పాల్గొంటారు. కానీ ఇటలీలో పది మంది కంటే ఎక్కువ గుమిగూడకూడదు కాబట్టి.. అంత్యక్రియల్లో ప్రీస్ట్, స్మశానం అసిస్టెంట్ మినహా ఎవర్నీ అనుమతించడం లేదు. అలాగైనా అంత్యక్రియలు చేయించుకోవాలంటే.. చర్చిలో పేరు ఎప్పుడొస్తుందా అని నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

 

చనిపోయిన వారి మృతదేహాల్ని  మార్చురీల్లో భద్రరపరిచి.. సమీపంలోని చర్చిల్లో తమవారి పేరు ఎప్పుడొస్తుందా అని మృతుల బంధువులు ఎదురుచూస్తున్నారు. తమవారు కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. శవాల ఖననం కోసం శవపేటికలు క్యూ కట్టి ఉన్నాయి. పోనీ దహనం చేద్దామని క్రిమటోరియానికి వెళ్తే అక్కడా అదే పరిస్థితి సాధారణంగా పేపర్లలో ఓ పేజీని సంతాప ప్రకటనల కోసం కేటాయిస్తారు. కానీ ఇటలీలోల ఏకంగా పది పేజీలు సంతాప ప్రకటనలకే కేటాయించాల్సిన పరిస్థితి. ఇటలీలో ఎటు చూసినా అంబులెన్సుల హోరు, శవపేటికల గుట్టలే కనిపిస్తున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పటి కంటే పరిస్థితి మరింత భయానకంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇటలీ మొత్తం క్వారంటైన్ లో ఉన్న పరిస్థితులున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: