తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలనుకుంటున్నారా..? రూముల కోసం నానా తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ రద్దీగా  ఉండే తిరుపతి.. కరోనా ఎఫెక్ట్‌తో భక్తులు రాక తగ్గడంతో.. నిర్మానుష్యంగా మారిపోయింది. హోటల్ రంగం కుదేలవగా.. కోట్ల రూపాయలు బిజినెస్ కాస్తా వేలల్లోకి పడిపోయింది. 

 

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఉండే తిరుమల మీద ఆధారపడిన నగరం తిరుపతి. ఎన్నో వ్యయప్రయాలకోర్చి ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుపతికి వస్తారు భక్తులు. దీంతో నగరంలోని హోటళ్లు, సత్రాలు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి. వ్యాపారం  జోరుగా సాగుతుండటంతో.. హోటల్‌ పరిశ్రమ అతి పెద్దదిగా ఎదిగింది. సంపన్నులు వినియోగించే లగ్జరీ రూమ్‌ల నుంచి సామాన్యులు సర్ధుకునే చిన్న గదుల దాక అన్ని హోటళ్లు తిరుపతిలో ఉన్నాయి.

 

తిరుపతిలో 15 వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అద్దె ఉండే ఏ కెటగిరి హోటళ్లు ఇరవై పైన ఉన్నాయి. రోజుకు వెయ్యి అద్దె ఉండే బీ కేటగిరి హోటళ్లు ఎనబై ఉండగా.. ఐదు వందలలోపు అద్దె ఉండే హోటళ్లు వెయ్యి వరకు ఉన్నాయి. ఇక సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్‌హోస్‌లకు లెక్కేలేదు. ఇలా అన్ని కేటగిరిల్లో సుమారు నాలుగువేల హోటళ్లున్నాయి. ప్రస్తుతం కరోనా దెబ్బకు ఇవన్ని ఖాళీ అయ్యాయి. 

 

హోటళ్ల పరిస్థితి అలా ఉంటే.. ఆహార పదార్థాల వ్యాపారం ఇంకా అద్వాన్నంగా తయారైంది. భక్తులపైనే ఆధారపడ్డ చిన్నాచితక ఇడ్లీల బండ్లు నడుపుకునే వారు అల్లాడుతున్నారు. ఇక 100కి పైన ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. రోజు కోట్ల రూపాయల వరకు జరిగే లావాదేవీలు ప్రస్తుతం పూర్తిగా పడిపోయాయనేది వ్యాపారుల ఆవేదన. నోట్ల రద్దు సమయంలో కూడా ఇంతటి నష్టాలను చూడలేదని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు.

 

మొత్తం మీద.. వైరస్ దెబ్బకు తిరుపతి నగరంలో అన్ని రకాల వ్యాపారాలు చతికిల పడిపోయాయి. గుంపులుగా నిలబడితే ఎక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేది ప్రధాన భయంగా తిరుపతిని పట్టి పీడిస్తోంది. ఇంక ఎన్ని రోజులకు పరిస్థితులు మారుతాయోనంటూ ఎదురు చూస్తున్నారు వ్యాపారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: