రైతుల రుణమాఫీపై  తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటోంది. అయితే, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. 

 

ఎట్టకేలకు తెలంగాణ సర్కార్‌.. వ్యవసాయ రుణాలమాఫీపై క్లారిటీ ఇచ్చింది. లక్షలోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే కుటుంబానికి లక్ష చొప్పున మాత్రమే రుణం మాఫీ చేస్తామని మెలిక పెట్టింది. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ... వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఏప్రిల్ 1, 2014 నుంచి 11 డిసెంబర్ 2018 మధ్య.. పంట రుణం తీసుకున్నవారికే  రుణమాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్టును ,తయారు చేసే బాధ్యతను వ్యవసాయ శాఖకు అప్పగించింది. గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితా రూపొందించి మండల స్థాయిలో బ్యాంకర్ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి జాబితా ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీల్లో పంటలకోసం బంగారం తనఖా పెట్టి  తీసుకున్న లోన్లకు రుణమాఫీకి వర్తించదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక, కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా.. ఒక్కరికి మాత్రమే లక్ష చొప్పున రుణం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి లక్ష వరకు రుణమాఫీ కానుంది. 

 

25వేల లోపు ఉన్న రుణాలను ఒకే దఫాలో.. లక్ష వరకు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు మాఫీ మొత్తాన్ని చెక్కుల రూపంలో అధికారులు అందించనున్నారు. రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: