రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణకు కూడా సుప్రింకోర్టు బ్రేకులు వేసింది. ఎన్నికల వాయిదాను తన విచక్షణాధికారం మేరకే తీసుకున్నట్లు నిమ్మగడ్డ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే కమీషనర్ విచక్షణకు మూడు రకాలుగా  బ్రేకులేసింది.  దాంతో సుప్రింకోర్టు తీర్పులో జగన్మోహన్ రెడ్డికి కూడా కాస్త ఊరట లభించినట్లైంది.

 

నిమ్మగడ్డ విచక్షణకు సుప్రింకోర్టు వేసిన బ్రేకులేమిటంటే ముందు ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తున్నట్లు ప్రకటించటం. ఎందుకంటే ఆరు వారాల పాటు ఎలాగూ ఎన్నికలు జరగనపుడు ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉంచటంలో అర్ధం లేదు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందంటూ నిమ్మగడ్డ స్పష్టంగా చెప్పారు. నిమ్మగడ్డ చెప్పిన దాన్నే కోర్టు కొట్టేసింది. ఇక జగన్ అత్యంత ప్రతిష్టగా తీసుకున్న పేదలకు 25 లక్షల ఇళ్ళ పథకాన్ని నిరాఘాటంగా అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

 

ఎందుకంటే పేదలకు 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణి నిజానికి కొత్త పథకం కాదు. ఎందుకంటే ఈ పథకం అమలుకు ప్రభుత్వం నాలుగు నెలలుగా కసరత్తు చేస్తోంది. అంతుకు ముందే ఇళ్ళ పట్టాల పథకాన్ని జగన్ ప్రకటించాడు. అన్నీ విషయాలూ తెలిసినా సరే కమీషనర్ మాత్రం పథకం అమలుకు అంగీకరించలేదు.  పథకం అమలుకు ప్రభుత్వం  రిక్వెస్ట్ చేసిన పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలతో ఇపుడు ఈ పథకాన్ని జగన్ అమలు చేసేయబోతున్నారు.

 

ఇక చివరగా ఎన్నికల నిర్వహణను ప్రభుత్వంతో చర్చలు జరిపి తేదీలను ఫైనల్ చేయాలని ఎన్నికల కమీషనర్ ను ఆదేశించింది. ఎన్నికల వాయిదాను నిమ్మగడ్డ తన విచక్షణ పేరుతో ఏకపక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి మళ్ళీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని కూడా ఏకపక్షంగా నిర్ణయించకుండా  ప్రభుత్వంతో మాట్లాడే డిసైడ్ చేయమని స్పష్టంగా చెప్పింది. దీంతో  ఇటు జగన్ కు అటు నిమ్మగడ్డకు ఇద్దరికీ సుప్రింకోర్టు ఒకేసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: