కరోనా ఓవైపు ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని వ్యాప్తిని ఎలా అరికట్టాలి.. ప్రజలను ఎలా ఎడ్యుకేట్ చేయాలి.. దీని ప్రభావం ఎలా ఉంటుంది.. ఇలాంటి విషయాలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే.. తెలుగు మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రత్యేక కథనాలు కూడా వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఆ ప్రత్యేక కథనాల్లోనూ రాజకీయమే కనిపిస్తోంది. అదెలాగంటారా..?

 

 

ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా... కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా సరే.. దాన్ని సాకుగా చూపించి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ప్రారంభమైన స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపేశారు. కారణమేంటయ్యా అంటే కరోనా నుంచి జనాలను కాపాడటమే అన్నారు. ఇది కాస్త సీఎం జగన్ కు చిర్రెత్తించింది. ఇదేదో చంద్రబాబుకు సహకరించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పన్నిన కుట్రగా భావించారు. ఆ ముక్కే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. అంతే కాదు. ఏపీలో కరోనా ఎన్నికలు వాయిదా వేయాల్సినంత తీవ్రంగా లేదని తేల్చి చెప్పేశారు. ఇక అప్పటి నుంచి మీడియాలోనూ మార్పు వచ్చేసింది.

 

 

కరోనా ముందు ముందు ఇంకా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి.. ఇప్పుడే.. ఎన్నికలు జరపాలంటూ సర్కారు అనుకూల పత్రిక సాక్షి తేల్చి పారేసింది. ఆ మేరకు ఓ కథనం ప్రచురించింది. ఇందులో ప్రజా ప్రయోజనం కంటే.. తమ అధినేత మాటే కరెక్టు అన్న ధోరణే కనిపించింది. ఇక సాక్షి తీరే ఇలా ఉంటే.. చంద్రబాబు అనుకూల పత్రికు తక్కువ తింటాయా.. అవీ ఆ ధోరణిలోనే రెచ్చిపోయాయి. బాబోయ్ కరోనా విశ్వరూపం చూపిస్తోందిరోయ్.. అంటూ జనాన్ని ఇంకా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే జగన్ చెప్పింది తప్పు.. ఎన్నికల కమిషనర్ చేసిందే రైటు అని జనం అనుకునేలా కథనాలు రాసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 

 

చంద్రబాబు అనుకూల పత్రికల్లో అన్నింటికంటే ముందుండే.. జ్యోతి ఇంకో అడుగు ముందుకేసింది. కరోనా ప్రభావాన్ని ఒప్పుకునేందుకు సీఎంకు ఇగో అడ్డువస్తోందని.. దాని వల్ల అధికారులు ఏం చేయాలో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారని.. దీని కారణంగా.. సరిగ్గా కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టడం లేదని.. అనుమానిత కేసుల సంఖ్య పెరిగిపోతోందని రాసుకొచ్చింది. దీంతో కరోనా ప్రజలకే కాదు.. ఈ పత్రికలకూ వచ్చిందనుకుంటున్నారు ఆంధ్రప్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి: