ఏపీలో ఇప్పుడు జగన్ వర్సస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనేది హాట్ ఇష్యూగా మారింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కరోనా కారణంతో అనూహ్యంగా .. అదీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చెప్పకుండా.. సంప్రదింపులు లేకుండా వాయిదా వేయడం ఈ ఇద్దరి మధ్య యుద్ధానికి దారి తీసింది. నిమ్మగడ్డ నిర్ణయంతో షాక్ అయిన జగన్ చాలా ఫ్రస్ట్రేషన్ తో స్పందించారు. అసలు సీఎం అయ్యాక ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించన జగన్.. నిమ్మగడ్డ ఇచ్చిన షాక్ తో తొలి ప్రెస్ మీట్ నిర్వహించి.. మనసులో ఉన్న కోపమంతా కక్కేశారు.

 

 

రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కులం ముద్ర వేశారు. చంద్రబాబు సామాజిక వర్గం కావడం వల్లే ఆయనకు సహకరిస్తున్నారన్నారు.. అసలు ఏపీకి సీఎం నేనా.. ఈ నిమ్మగడ్డా అంటూ రంకెలు వేశారు. జగన్ కు సహజంగానే కోపం ఎక్కువ అన్న పేరుంది. దీనికి తోడు నిమ్మగడ్డ తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే సరికి ఉక్రోషం పట్టలేకపోయారు.

 

 

కానీ కోపతాపాలు తగ్గాక ఆలోచిస్తే.. జగన్ మరో రాంగ్ స్టెప్ వేశారా అనిపిస్తోంది. దీనికి తోడు నిమ్మగడ్డ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ ఎన్నికల కోడ్ ఎత్తేస్తూ వచ్చిన తీర్పు కాస్త ఊరట కలిగించినా ఎన్నికల వాయిదాపై మాత్రం నిమ్మగడ్డ నిర్ణయమే కరెక్టని కోర్టు తేల్చి చెప్పింది. ఈ లోపు రాజ్యంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డపై వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాటల దాడులు చేశారు. బూతులు తిట్టడం ఒక్కటే తక్కువ అనే రేంజ్ లో కామెంట్లు చేశారు.

 

 

మరోవైపు తనకు రక్షణ కావాలంటూ తాజాగా నిమ్మగడ్డ కేంద్రాన్ని కోరడం జగన్ తో జగడం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ తో కయ్యానికి సిద్దం అని నిమ్మగడ్డ చెప్పకనే చెప్పినట్టైంది. ఏదేమైనా .. ఏపీకి సీఎం అయినా జగన్ నిమ్మగడ్డను ఏమీ చేయలేరన్న సంగతి వాస్తవం. అందులోనూ ఆయన పదవీకాలం ఇంకో ఏడాది ఉంది. ఎలాగూ తనపై కులం ముద్ర, టీడీపీ ముద్ర వేశారు కాబట్టి ఆయన జగన్ కు చుక్కలు చూపించే అవకాశాలే ఎక్కువ. ప్రతిసారీ కోర్టులకెక్కి న్యాయ పోరాటం సాధ్యం కాదు కదా. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తులతో జగన్ కాస్త జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరాన్ని ఈ నిమ్మగడ్డ ఉదంతం గుర్తు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: