ఈరోజు బ్యాంకుల అవసరం లేకుండా ఎవరు ఉన్నారు.. మన జీవన వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులు అవసరం తప్పడం లేదు. ఇవి మన పురోగతికీ కారణం అవుతున్నాయి. ఇప్పుడు రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులూ.. అంతా బ్యాంకులతో సంబంధం ఉన్నవాళ్లే.

 

 

అయితే ఈ బ్యాంకులపై ప్రభుత్వాల కంట్రోల్ కూడా ఉంటుంది. పూర్తిగా కాకపోయినా ప్రభుత్వాల మార్గదర్శకాలు అవి పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు బ్యాంకర్లతో ముఖ్యమంత్రులు సమావేశం అవుతుంటారు. తాజాగా సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమయంలో మహిళలకు వడ్డీ రేట్లపై బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు జగన్.

 

 

వైయస్‌ఆర్‌ జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకు రావాలని జగన్‌ బ్యాంకర్లను కోరారు. ఖరీఫ్‌ రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని సీఎం బ్యాంకర్లకు వివరించారు.

 

 

గ్రామాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం దిశగా తగు చర్యలు తీసుకుంటున్నామని జగన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని సీఎం చెప్పారు. రైతు భరోసా కేంద్రాలతో విప్లవాత్మకమైన పరిస్థితులు తెస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: