భారత్ లో కరోనా వైరస్ భారీన పడిన వారి సంఖ్య 158కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 8 మందికి వైరస్ నిర్ధారణ అయింది. నిన్న స్కాట్లాండ్ నుండి మేడ్చల్ వచ్చిన యువకుడికి కరోనా నిర్ధారణ కాగా ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో వీరికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రానికి ఇండోనేషియా నుంచి పది మంది రాగా వీరిలో 8 మంది కరోనా భారీన పడ్డారు. మంగళవారం రోజున ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా నిన్న ఏడుగురికి వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
ప్రభుత్వం 100 ప్రత్యేక బృందాల ద్వారా కరీంనగర్ లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తోంది. అధికారులు వీరు కరీంనగర్ లో ఎవరెవరిని కలిశారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. కరీంనగర్ లో యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపడుతున్నారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,00,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 7,900 మందికి పైగా మరణించినట్లు సమాచారం. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కేంద్రం పరీక్షలను కూడా వాయిదా వేయాలని ప్రకటన చేసింది. కేంద్రం ప్రకటనతో సీ.బీ.ఎస్.ఈ పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: