ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. నిమ్మగడ్డకూ... సీఎం జగన్ కూ ఉప్పూనిప్పుగా ఉన్న సమయంలో నిమ్మగడ్డ ఏకంగా కేంద్రానికి లేఖ రాశారని వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఈ లేఖ తానే రాశానని నిమ్మగడ్డ ధ్రువీకరించకపోవడం విశేషం. అయినా సరే.. ఆ లేఖలో అంశాలు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి. 

 

ఆ లేఖలో ఏముందో చూద్దాం.. ‘ఆంధ్రప్రదేశ్‌లో తనకు , తన కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదని.. కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని... ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్‌ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చానని  ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ పేర్కొన్నట్లుగా ఉంది. 

 

ఆ లేఖలో ఉన్న విషయాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు, నా కుటుంబానికి భద్రత విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండటమే కొంత సురక్షితం. అలాగని పూర్తిగా కాదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కార్యాలయంలోనే పోలీసుల రక్షణలో ఉంటున్నాను. పూర్తి రక్షణ లేకుండా బయటకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నాను. 

 

 

నాపైనా, నా కుటుంబసభ్యులపైనా భౌతికదాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణనలోకి తీసుకుని నాకు, నా కుటుంబసభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఈ రక్షణ ఏర్పాట్లు కొనసాగాలి. ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చాను  అని లేఖలో ఉంది. మరి ఇది నిమ్మగడ్డే రాశారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: