కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌విత‌ను స్థానిక సంస్థ‌ల  ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం వెనుక ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌హుముఖ వ్యూహం  ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఓడిన చోటే రాజ‌కీయంగా క‌విత‌ను నిల‌బెట్టి, ఆమెకు తిరుగులేకుండా చేసేందుకే ఆమెను ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కేసీఆర్ ఎంపిక చేసి ఉంటార‌న్న చ‌ర్చ టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ బ‌లోపేతం కావాలంటే క‌విత లాంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఎంతో అవ‌స‌ర‌మ‌ని కూడా కేసీఆర్ భావించి ఉంటార‌ని తెలుస్తోంది. ఇక అదే స‌మ‌యంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌విత‌పై విజ‌యం సాధించిన అర‌వింద్‌ను ఎదుర్కొని రాజ‌కీయంగా అత‌డిని ఫెయిల్యూర్ చేయాల‌నే వ్యూహం కూడా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

వాస్త‌వానికి గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత క‌విత నిజామాబాద్ రాజ‌కీయాల‌కు చాలా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ప‌లుమార్లు పార్టీ నాయ‌కులు వ‌చ్చి నిజామ‌బాద్‌కు రావాల‌ని కోరినా ఆమె సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే ప్రొటోకాల్ ప‌రంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న‌కోణంలో కూడా ఆమె జిల్లా రాజ‌కీయాల‌కు చాలా దూరంగా ఉన్నారు. ఇక రాజ్య‌స‌భ ప‌ద‌వికి ఎంపిక చేస్తార‌న్న ప్ర‌చారమూ జ‌రిగినా నిజం కాలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌డం వెనుక ఆమెను మంత్రివ‌ర్గంలోకి తీసుకునే ఆలోచ‌న కూడా కేసీఆర్‌కు ఉండి ఉంటుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 

నిజామాబాద్ ఎంపీ అర‌వింద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప‌సుపుబోర్డు హామీ నెర‌వేరేలా లేదు. దీంతో ఇప్పుడు ఆమెకు ఆ అంశం ప్ర‌ధానాస్త్రం కానుంది. ఓడిన చోటే అర‌వింద్‌పై రాజ‌కీయంగా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని క‌విత యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌ను తీసుకుంటే అర‌వింద్‌కు ఇక చెడుగుడే అంటూ ఆమె అభిమానులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే క‌విత‌కు మ‌ద్ద‌తుగా...అర‌వింద్‌ను హెచ్చ‌రిస్తూ అర‌వింద్ ఊపిరి పీల్చుకో...క‌వితక్క‌ వ‌స్తోంది అంటూ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అస‌లు ఆట ఇక ఇప్పుడు  మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: