నోరు పారేసుకోవ‌డంలో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉండే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి త‌న‌బుద్ధిని చూపించుకున్నారు. క‌రోనా వైర‌స్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇది చైనీస్ వైర‌స్ అంటూ వ్యాఖ్యానించిన‌ ట్రంప్‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) మండిప‌డింది. మ‌రోసారి అలా అనొద్ద‌ని గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది.  * వైర‌స్‌ల‌కు స‌రిహ‌ద్దులు తెలియ‌దు. మీది ఏ జాతి అన్న సంగ‌తి దాకికి అస్స‌లే అవ‌స‌రం లేదు. నీ వ‌ర్ణంతోనే దానికి సంబందం లేదు. నీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత డ‌బ్బు ఉన్నా ఆ వైర‌స్ ప‌ట్టించుకోదు. కానీ క‌రోనా గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ప‌దాల‌ను వాడాలి.  అనుచితంగా నోరు పారేసుకోవ‌డం స‌రికాదు. వైర‌స్ పేరుతో ఒక‌ర్ని నిందించ‌డం స‌రికాదు* అని  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైక్ ర్యాన్ స్ప‌ష్టం చేశారు.  అంతేగాకుండా.. ట్రంప్‌కు జ్ఞానోద‌యం క‌లిగేలా ప‌లు ఉదాహార‌ణ‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. 2009లో హెచ్‌1ఎన్‌1 వైర‌స్ నార్త్ అమెరికాలో మొద‌లైందని, కానీ అప్పుడు ఎవ‌రూ అమెరిక‌న్ ఫ్లూ అంటూ ఆ ప్రాంతం పేరుతో వైర‌స్‌ను పిలువ‌లేద‌ని ర్యాన్ పేర్కొన్నారు.

 

ఇదే స‌మ‌యంలో  ఇత‌ర వైర‌స్‌ల విష‌యంలో ఇదే త‌ర‌హా ప‌ద్ధ‌తి పాటించాల‌ని ఆయ‌న సూచించారు.  ఓ ప్రాంతంతో వైర‌స్‌ను పోల్చ‌డం మానుకోవాల‌ని, అది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న సూచించారు.  వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌పంచ దేశాలు అన్నీ క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల‌ని ర్యాన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌పంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 2 ల‌క్ష‌లు దాటిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియాసెస్ తెలిపారు.  వైర‌స్‌పై పోరాటం చేసే క్ర‌మంలో సంఘీభావ స్పూర్తిగా ఉండాలే త‌ప్ప నిందాపూర్వ‌క వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు. మ‌రోవైపు, ట్రంప్‌కు అమెరికా ప‌రిశోధ‌కులు షాక్ ఇచ్చారు. చైనా ప్ర‌భుత్వం జీవాయుధం(బ‌యో వెప‌న్‌) త‌యారు చేస్తుండ‌గా క‌రోనా వైర‌స్ పుట్టింద‌న్న అపోహ‌ల‌ను కొట్టిపారేశారు. ఈ వైరస్ ల్యాబ్‌లో పుట్ట‌లేద‌ని, ప్ర‌కృతి సృష్టించింద‌ని అమెరికాలోని స్ర్కిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. వారు క‌రోనా వైర‌స్ జ‌న్యుక్ర‌మాన్ని విశ్లేషించారు.  సార్స్ కొవిడ్‌-2 ప‌రిణామం చెంది కొవిడ్‌-19గా మారింద‌ని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: