దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా ప్రభావం కూరగాయలపై పడింది. చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందని వదంతులు వైరల్ కావడంతో కూరగాయల వినియోగం భారీగా పెరిగింది. వినియోగం పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగనివారు కూడా నేడు చికెన్ కు వీలైనంత దూరంగా ఉంటున్నారు. 
 
మరోవైపు దిగుబడులు పెద్దగా లేకపోవడంతో కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో గతంతో పోలిస్తే కూరగాయల వినియోగం బాగా పెరిగింది. ప్రజలు కరోనాకు భయపడి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని కూరగాయల నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర జనాభా కోటీ 20 లక్షలు. ప్రతిరోజూ 2,500 టన్నుల నుండి 3,500 టన్నుల కూరగాయలు నగరంలో అమ్ముడవుతాయి. 
 
గత వారం రోజుల నుండి 4,000 టన్నుల కూరగాయలు అమ్ముడవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నగరానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుండి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. కరోనా ప్రభావంతో కూరగాయల ధరలు కిలో 40 రూపాయల కంటే ఎక్కువ పలుకుతున్నాయి. చిక్కుడుకాయ, ఆలుగడ్డ, బెండకాయ, బీరకాయ ధరలు కిలో 40 రూపాయలుగా ఉన్నాయి. 
 
టమాటా, ఉల్లి ధరలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. కూరగాయల వినియోగం ఇదే స్థాయిలో ఉంటే రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయల ధరలు పెరగటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.  మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం కూరగాయల రేట్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీలోను కూరగాయల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: