దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి మెల్లమెల్లగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో 169 కేసులు నమోదు అయ్యాయని అంటున్నారు. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న వారిని ఎయిర్ పోర్టుల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నామని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 లక్షల మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరుకుందని తెలిపింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపగా, ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.

 

ఇప్పటికే నెల్లూరిలో ఓ వ్యక్తికి కరోనా సోకిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల అతను ఇటలీ నుంచి రావడంతో కరోనా లక్షణాలు కనిపించాయని అతన్ని పర్యవేక్షణలో ఉంచామని అన్నారు వైద్యులు. తాజాగా ఒంగోలు నగరానికి లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటవ్ వచ్చింది. ఆ యువకుడు, ఇండియాకు వచ్చిన తరువాత న్యూఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి రావడంతో అతను ఎవరెవరిని కలిశాడన్న విషయంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.  అతనికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు పరీక్షలు చేసి, కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

 

అయితే ఢిల్లీ నుంచి ఒంగోలు వచ్చిన తర్వాత ఇంటికి చేరుకొని రెండు రోజుల తరువాత హైదరాబాద్ వెళ్లాడు.  దేశంలో ఉన్న వారికంటే విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని.. ఎక్కడ పడితే అక్కడ తిరగడం మంచి పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు. ఆపై అప్రమత్తమైన వైద్యులు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సను అందిస్తూ, కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు. మరోవైపు రోగి సంచరించిన ప్రాంతం  ముంగమూరు డొంక ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పరిధిలోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: