యుద్ధం మొదలే కాకూడదు. ఒకసారి మొదలయ్యాక దాని వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయటం కంటే.. దాని విపరిణామాల్ని అనుభవించేందుకు సిద్ధం కావాల్సిందే. అందుకే అధునిక ప్రపంచంలో చాలావరకు శాంతి మంత్రాన్ని ఆలపించటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. విపరీతమైన ఆశతోనో.. మూర్ఖత్వంతోనో కయ్యానికి కాలు దువ్విన దేశాలు అందుకు తగిన మూల్యం చెల్లిస్తూనే ఉన్నాయి. ప్రపంచ పెద్దన్న అమెరికాకు సైతం యుద్ధం తలపోటు ఎంత తీవ్రమైందో అర్థమైంది. కానీ.. గుణపాఠం నేర్చుకుంటుందా? లేదా? అన్నది సందేహమే. ఎందుకంటే.. యుద్ధం ఒక వ్యసనం. అధిపత్యం కోసం.. సహజ వనరుల్ని దుర్మార్గంగా దోచుకునేందుకు జరిగే మారణకాండకు యుద్ధం నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి అత్యాశ కలిగిన అగ్ర రాజ్య దురంహకారానికి చిన్న దేశాలు బలయ్యాయి. అదే సమయంలో యుద్ధం తాలూకూ విషాదాన్ని అగ్రరాజ్యం కూడా పంచుకోవాల్సి వచ్చింది. అందుకే యుద్ధం జోలికి ఎవరూ వెళ్లరు. వెళ్లాలని ఊవ్విళ్లూరుతున్న వారిని ముందుచూపు ఉన్న వారు హెచ్చరిస్తుంటారు. యుద్ధం మాదిరే విద్వేషం కూడా చాలా ప్రమాదకరమైనది. అది ఒకసారి అవహించాక దాని మత్తు నుంచి బయటకు రాలేం. దాని చుట్టూనే తిరుగూనే ఉంటాం. చివరకు అది పూర్తిగా దహించేశాక మాత్రమే అదెంత ప్రమాదకరమైందో తెలుస్తుంది. రాష్ట్ర విభజన వ్యవహారాన్ని యుద్ధంతోనో మరోదానితోనో పోలిస్తే తెలంగాణ ఉద్యమకారులు నొసలు చిట్లిస్తారు. తమ లక్ష్యసాధనను అవమానపర్చారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక మహోన్నత ఆశయం కోసం పోరాడుతున్న వారి ఉద్యమ ఫలాలు నోటిదాకా వచ్చిన నేపథ్యంలో.. దాన్ని భరించలేక అక్కసుతో ఇలా తెగబడుతున్నారని అగ్రహిస్తారు. ఇదంతా సీమాంధ్రుల కుట్ర అని.. కొంతమంది పెట్టుబడిదారులు డబ్బులు వెదజల్లి ఇలాంటి కట్టుకథలు రాయించారని ఆరోపించేవారు సైతం లేకపోలేరు. నిజానికి.. వారున్న మానసిక స్థితికి అంతకు మించి ఆలోచనలు కూడా తట్టవు. ప్రపంచంలో జరిగిన ప్రతి ఉద్యమానికి.. బొమ్మా.. బొరుసులు రెండూ తప్పనిసరి. కానీ.. తెలంగాణ ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తే.. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించేవారి గొంతే వినిపిస్తుంది. వద్దనే వారి మాట అస్సలు వినపడదు. ఒకవేళ వినిపిస్తే.. అలా మాట్లాడిన వ్యక్తి కచ్ఛితంగా తెలంగాణ ద్రోహి మాత్రమే అవుతాడన్న నిక్కచ్చిగా తేల్చి చెబుతారు. రెండు వాదనలు లేని ఏ పోరాటమైనా ఉంటుందా? ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమన్నది సహజ పరిణామన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమ కల సాకారమవుతుందని సంతోషపడుతున్నా సగటు తెలంగాణవాదిని ఒక ప్రశ్న అడిగితే తీవ్ర ఇబ్బందికి గురి అవుతాడు. అవమానిస్తున్నారన్న అనుమానం కళ్లల్లో కనిపిస్తుంది. విజయానికి అడుగు దూరంలో ఉండి.. ఆ అద్భుత క్షణం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నేమిటని విసుగ్గా చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. తెలంగాణ కల సాకారం అవుతుందనుకుంటున్న వారు.. ఎలా సాకారం అవుతుంది? ఎందుకు అవుతుంది? ఉద్యమాల ఫలితంగానా? తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొనా? తీవ్రమైన భావోద్వేగంతో బలవన్మరణాలకు పాల్పడిన వెయ్యి మంది అమరవీరుల త్యాగాల కారణంగా తెలంగాణ వస్తుందా? దేని కోసం? ఈ ప్రశ్నల్ని నిజాయితీగా వేసుకుంటే.. సమాధానాలు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవరికి వారికి తెలిసినవే. సీమాంధ్రుడి సమైక్యవాదం మొత్తం హైదరాబాద్ చుట్టూనే ఉందనే వారికి ఇలాంటి ప్రశ్నల్ని సాపేక్షంగా ఆలోచించలేరు. అందరికీ తెలిసిన జవాబు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వార్థ రాజకీయం కోసమే తప్ప.. మరి దేనికి కాదు. ఒకవేళ కాంగ్రెస్ బలంగా ఉండి.. కేంద్రంలో 200సీట్ల కంటే ఎక్కువ స్థానాల్ని కైవశం చేసుకునే అవకాశం ఉండి ఉంటే.. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్న నేతలంతా.. వేరేగా మాట్లాడేవారనటంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సీమాంధ్రులు సమైక్యం అని ఎందుకంటారు? వారు తమ దురహంకారంతో.. తమ అధిపత్య ధోరణిని ప్రదర్శించుకునేందుకే అంటూ ఆవేశంతో మాట్లాడే వారు చాలామందే ఉంటారు. అదే సమయంలో హైదరాబాద్ కోసమని మరికొందరు వాదించేవారు లేకపోలేరు. నిజాయితీగా మాట్లాడితే.. రెండో విషయం కొంతవరకూ వాస్తవం ఉందని చెప్పుకోవాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ ఏమాత్రం డెవలప్ మెంట్ కానట్లయితే.. ప్రత్యేక రాష్ట్ర నినాదం ఇంత బలంగా ఉండేది కాదేమో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో మూడు అడుగుల దూరంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించటం.. విమర్శించటం సరికాదని చెప్పేవారు ఉండకపోరు. భావోద్వేగంతో ఊగిపోకుండా.. భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుందన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఈ సమయంలో ఎందుకిలా అన్నది అర్థమవుతుంది. ఇంతకీ.. ఈ మొత్తం ఎపిసోడ్ లో విజేతలు ఎవరు? పరాజితులు ఎవరన్నది ప్రధాన ప్రశ్నగా మారే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఈ ప్రశ్న పెద్దగా ఉండదు కానీ.. రానున్న రోజుల్లో ఇదే ప్రధానమవుతుంది. సమస్యలు మొత్తం అక్కడి నుంచే మొదలవుతాయన్నది కూడా మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమ గెలుపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే అన్న నినాదాన్ని రుద్ది చాలా కాలమే అయ్యింది. దాన్ని అందరూ అంగీకరించటమేకాదు.. అలాంటి క్షణం కోసం పెద్దఎత్తున తెలంగాణవాదులు ఎదురుచూస్తున్నారు. రేపొద్దున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన వెంటనే అనందోత్సాహాలకు.. ఉత్సవాలకు అంతే ఉండదు. ప్రాంతాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామనే స్ఫూర్తికి ఉత్సవాలు దెబ్బ తీసేవే కదా. ఎందుకంటే.. అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారి మధ్య గెలుపోటములు ఎందుకు ఉంటాయి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర దోపిడీ నుంచి విముక్తి అయ్యామని.. దురంహరానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటంతో.. అంతిమంగా తెలంగాణ ఆత్మగౌరవానికే విజయం లభించిందన్న మాటలు.. వ్యాఖ్యలు భవిష్యత్తులో వినిపించటం ఖాయం. ఇలాంటి మాటలు అన్నదమ్ముల మధ్య ఎందుకు ఉంటాయి? అన్నదే ఇక్కడ మౌలిక ప్రశ్న. నిజమైన అన్నదమ్ముల్ని.. అగర్భ శత్రువులుగా మార్చేసిన ఘనత సార్థరాజకీయాలకు దక్కకుతుంది. లాభ నష్టాల గురించి.. గెలుపోటముల కోణంలోనే తెలుగు జాతి భవితవ్యాన్ని లెక్కలేద్దాం. విభజన ప్రక్రియ పూర్తయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇరు ప్రాంతాల మధ్య విద్వేషం తరిగిపోతుందా? పెరుగుతుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం.. భావోద్వేగం ఉండదు. సొంత ప్రాంతంలో ఎవరి మానాన వారు బతుకుతుంటారని చెబుతారు. అలా చెప్పిన వారి మాట నమ్మితే తప్పకుండా తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఇరు ప్రాంతాలు ఇష్టంతో విడిపోవటం లేదు. ఒక ప్రాంతం వారి ఉద్యమం కారణంగా తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో విడిపోయాక రెండు ప్రాంతాలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయాన్న గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే.. తెలంగాణ ఏర్పడితే కలిగే లాభాల గురించి గత పన్నెండేళ్లుగా తెలంగాణ నేతలు ఉదరగొడుతున్నారు. కానీ.. వాస్తవంలో అవన్నీ అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి వెనువెంటనే జరిగిపోవు. కొంత సమయంలో పట్టటం తప్పనిసరి. మరి.. అంత కాలాన్ని తెలంగాణవాదులు అంగీకరిస్తారా అన్నది ప్రధానప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ నాయకులంతా సుద్దపూసల్లా మారిపోరు. స్వార్థానికి దూరంగా.. ప్రజా క్షేమం కోసం వారి జీవితాల్ని అంకితం చేయరు. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు దాదాపు 5వేల కోట్ల రూపాయిల నుంచి పది వేల కోట్ల రూపాయిల వరకూ ఉంటుందని చెబుతారు. ఇదంతా ఒక్కసారి కాదు.. గత పన్నెండేళ్ల ఉద్యమానికి అయిన ఖర్చు. ఇదంతా ఎవరూ త్యాగబుద్ధితోనో.. తెలంగాణ ప్రజల కోసం ఉచితంగా ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో ఇక్కడ కొన్ని త్యాగాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర ప్రజలు అమితంగా అగ్రహం వ్యక్తం చేసే వారిలో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. మిగిలిన విషయాల్ని పక్కనపెడితే.. ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాక.. ఆయనకున్న వ్యవసాయ భూమి చాలా భాగం తరిగిపోయింది. ఖర్చుల కోసం ఆయన దాన్ని అమ్మేశారు. కోదండరాం మాటల్ని అసహ్యించుకునే సమైక్యవాదులు.. ఒక్క రూపాయి ఆశించకుండా ఉద్యమం కోసం లక్షలాది రూపాయిల అర్థిక నష్టాన్ని భరించగలిగారు. ఇలాంటి వారూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉదాత్తమైన ఆశయంతో పని చేసిన వారు ఉన్నట్లే.. స్వార్థంతో ఖర్చు చేసిన వారూ ఉన్నారు. వారంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. ప్రతిఫలం ఆశించటం ఖాయం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు.. తెలంగాణ ఏర్పాటుతోనే బతుకు బొమ్మ కాస్త తెలుగుసినిమా మాదిరి మారిపోతుందని కల్పించిన భ్రమలు వాస్తవం కాదని తెలిశాక.. మరోమారు ఆవేశం రగులుతుంది. కానీ.. ఆ అగ్రహజ్వాలను చల్లార్చేందుకు అప్పటి రాజకీయ నాయకులకు సాయంగా నిలిచేది సీమాంధ్రుడి దురంహకారం.. వారి దోపిడీ మాత్రమే. 60ఏళ్ల పాటు సాగిన దోపిడీ కారణంగానే ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలమంటూ నాటి రాజకీయ నాయకులు చెప్పిన మాటల్ని వినాల్సిన పరిస్థితుల్లో తెలంగాణవాదులు ఉంటారు. ఇలాంటివి ఒకటికి రెండు వారి జీవితంలో చోటు చేసుంటన్నప్పుడు.. సీమాంధ్రుడు వారికి శత్రువే అవుతాడు తప్పించి.. సొంతవాడు ఎట్లవుతాడు? విభజన తర్వాత సీమాంధ్ర దారుణమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంది. తగ్గిన ఆదాయం.. అంతకు మించిన అప్పులతో సతమతమయ్యే సీమాంధ్ర రాష్ట్రానికి ఆర్థిక సమస్యలతో పాటు.. మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. మౌలిక సదుపాయాల లేమితో పాటు.. కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య నలుగుతున్న రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పుకొని ముందుకొచ్చే రాజకీయ వ్యవస్థ ఉచితంగా ఏదీ చేసి పెట్టదు. తాము చేసే ప్రతి పనికి మూల్యం భారీగానే ఆశిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు.. తెలంగాణ ప్రజల అగ్రహావేశాల్ని మోయాల్సిన భారం సగటు సీమాంధ్రుడి మీద పడుతుంది. అపారమైన వనరులు.. తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ వినియోగించ గలిగే స్థాయి.. సత్తా వచ్చేసరికి క్యాలెండర్లో చాలా సంవత్సరాలే పడతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీనికి తోడుగా విపత్తులు.. విలయాలు అదనంగా మీద పడితే.. సీమాంధ్రుడి జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో తమ తిప్పలకు కారణమైన తెలంగాణవాదుల్ని వారు సహోదరులుగా చూడలేరు. అంతేకాదు.. ఆర్థిక అవసరాల కోసం అవశేష ఆంధ్రప్రదేశ్ లో పన్నుల వడ్డింపు కాస్త భారీగా ఉండక తప్పనిస్థితి. కేంద్రం ఏమైనా ఆదుకుంటే.. ఈ పోటు ప్రజలకు కాస్త తగ్గుతుందేమో కానీ.. లేని పక్షంలో వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం ఖాయం. ఇప్పటివరకూ ప్రజల గురించి.. వారి కష్టాల గురించి మాత్రమే మాట్లాడినా.. ఈ మొత్తానికి కారణమైన రాజకీయ పక్షాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయం. తమ చేతకానితనంతో తమను మొత్తంగా మోసం చేశారని సీమాంధ్రులు రగిలిపోతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ బతుకులు బంగారుమయమైపోతాయని చెప్పిన దానికి భిన్నంగా ఉండటంపై తెలంగాణవాదులు రగిలిపోతారు. ఉద్యమాల పురిటిగడ్డ పేరుకు తగ్గట్లే మరో ఉద్యమానికి తెర లేచినా ఆశ్చర్యం లేదు. సొంత రాష్ట్రం.. సొంత ప్రభుత్వం అని నినదించిన వారు కాస్తా.. అధిపత్యం కోసం కోట్లాడుకోవటం గ్యారెంటీ. అన్నీ కలిసి రాజకీయనాయకుల మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తాయి. వీటితో పాటు.. మరిన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఇబ్బందుల్ని తెలంగాణ వాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో రాకపోకలకు.. క్రయవిక్రయాలకు చాలా అవకాశాలు ఉండేవి. కానీ.. ఇకపై పెట్టుబడులు పెట్టటం దగ్గర నుంచి రాకపోకల వరకూ మార్పులు చోటు చేసుకోవటం ఖాయం. 90ల ముందు వరకూ.. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సీమాంధ్రకు చెందిన వారు ఎక్కువగా చెన్నైని ఆశ్రయించే వారు. తర్వాత రోజుల్లో హైదరాబాద్ కు రావటం మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటుతో మళ్లీ అదే పరిస్థితి. విద్య కోసం, ఉపాధి కోసం, వైద్యం మొదలు టూరిజం వరకూ రకరకాల వ్యాపకాల మీద నిత్యం రాజధాని వచ్చే వారు దీర్ఘకాలంలో నెమ్మదించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. తెలంగాణకు వచ్చే రాబడి తగ్గుతుంది. ఆ లోటును ఆఖరికి భరించాల్సి వచ్చేది తెలంగాణ ప్రాంతీయులే అన్నది మర్చిపోకూడదు. ఇలా ఇరుప్రాంతాల వారు సమస్యలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి. ఏ మాత్రం రాజకీయ అస్థిరత్వం ఉన్నా.. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం మరింత పెరగటం ఖాయం. అంతేకాదు.. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి అటు సీమాంధ్ర నేతలు.. ఇటు తెలంగాణ నేతలు అశ్రయించేది విద్వేషాన్నే. అది రెండు ప్రాంతాల ప్రజల మధ్య పెద్ద అవరోధంగా మారుతుంది. అది.. తెలుగు ప్రజల్ని పరాజితుల జాబితాలో నిలుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: