కంటికి కనిపించని చిన్న జీవితో యుద్ధం చేస్తుంది ప్రపంచం. కలసికట్టుగా దాన్ని ఎదుర్కోవాలంటే ఉన్న ఒక్కటే మార్గం శుభ్రత. దీన్నే ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు నెటిజన్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమోట్ చేసిన ఈ ఛాలెంజ్‌ను ప్రస్తుతం ఇండియన్ సెలబ్రిటీలు అందరూ ఫాలో అవుతున్నారు. దీంతో ప్రస్తుతం సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది.

 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ పేరుతో చేతులను శుభ్రం చేసుకునే విధానంపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలను కూడా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరింది. అందుకోసం మొదటగా బాలీవుడ్ బామలు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రాలను ఆహ్వానించింది.

 

WHO సూచనలతో చేతులను సరైన పద్ధతిలో ఎలా శుభ్రం చేసుకోవాలో.. వివరిస్తూ దీపిక పదుకుణే, అనుష్క శర్మలు చేతులను వాష్ చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కొహ్లీను నామినేట్ చేశారు దీపిక.

 

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా విసిరిన సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ను స్వీకరించారు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు. చాలెంజ్‌లో చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను 30 సెకండ్ల నిడివితో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది సింధు. ఇక కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జాలు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు.

 

అటు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ కూడా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చంటూ హ్యాండ్ వాష్ చేసుకుని చూపించారు సచిన్ టెండూల్కర్. 

 

మరోవైపు.. అత్యవసరం అయితే తప్పా బయటికి వెళ్లకండని అభిమానులకు సూచిస్తున్నారు సెలబ్రిటీలు. ప్రజలందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం... అంటూ దేశ ప్రజలకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: