ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మాల్స్, థియేటర్లు కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం కరోనా విషయంలో ముందుజాగ్రత్తచర్యలు తీసుకుంటోందని చెప్పారు. 
 
రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సూచనల మేరకు థియేటర్లు, మాల్స్ బందు చేయనున్నట్లు ప్రకటన చేశారు. ప్రభుత్వం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల వల్లే రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. జగన్ ఆదేశాల మేరకు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని తెలిపారు. 
 
వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నోడల్ కేంద్రాన్ని ఎన్టీయార్ వర్సిటీలో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తిరుపతి, విజయవాడ, కాకినాడలలో ల్యాబ్ లు సిద్ధంగా ఉన్నాయని రానున్న రోజుల్లో అనంతపురంలో కూడా ల్యాబ్ ను సిద్ధం చేయనున్నామని తెలిపారు. 
 
13 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 80 వెంటిలేటర్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 100 వెంటిలేటర్లను అతి త్వరలో అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని సూచించారు.ప్రజలు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఒక రకమైన భయాందోళనలో ఉన్నారని అన్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 169కు చేరింది. తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 2 నమోదయ్యాయి.       

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: