నిన్న సోషల్ మీడియాలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాసినట్లు ఒక లేఖ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆ లేఖను తాను రాయలేదని ప్రకటన చేశారు. అధికారికంగా మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. 
 
నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ గురించి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైసీపీని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఆ లేఖను వైరల్ చేశారని అన్నారు. ఆ లేఖ సోషల్ మీడియాలో ఎవరు అప్ లోడ్ చేశారో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. ఈ లేఖ వైరల్ కావడంలో పలువురు మీడియా ప్రముఖుల పాత్ర కూడా ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు లేఖ గురించి ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల గురించి ఫిర్యాదు చేశారు. 
 
డీజీపీని వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారథి, కైలే అనిల్ కుమార్, జోగి రమేష్, అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు కలిశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వం ఈ లేఖను రాజకీయ కుట్రగా భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కుట్ర వెనుక ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
 
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖ ఆయన రాసింది కాకపోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. నిన్న ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేల నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని... భద్రత కల్పించాలని ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా ఒక లేఖ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: