పరిటాల శ్రీరామ్...2019 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఈ పేరు కాస్త ఎక్కువగానే వార్తలు ఉంటుంది. 2019 ఎన్నికల్లో తన తల్లి, మాజీ మంత్రి సునీతమ్మ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో, శ్రీరామ్‌కు టికెట్ దక్కింది. తమ కంచుకోట రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఊహించని విధంగా వైసీపీ తరుపున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు. ఇటు రాష్ట్రంలో టీడీపీ కూడా ఘోరంగా ఓటమి పాలైంది.

 

అయితే ఈ ఓటమి తర్వాత నుంచి చాలామంది టీడీపీ నేతలు పార్టీని వదిలేసి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే  పరిటాల ఫ్యామిలీ కూడా పార్టీ మారిపోతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. పరిటాల ఫ్యామిలీ టీడీపీని వీడలేదు. పైగా చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీకి రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గం చూసుకునే బాధ్యత అప్పగించారు.

 

అక్కడ నుంచి పరిటాల శ్రీరామ్ రెండు నియోజకవర్గానికి కవర్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే తన తండ్రి పరిటాల రవి మాదిరిగానే శ్రీరామ్‌కు అనంతపురం జిల్లాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఇదే ఫాలోయింగ్ వైసీపీకి ఇబ్బందిగా మారుతుందనో, లేక శ్రీరామ్‌ రాజకీయ భవిష్యత్‌కు ఆదిలోనే చెక్ పెట్టాలనే ఉద్దేశం ఏమో తెలియదుగానీ, ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి వైసీపీ, శ్రీరామ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

 

అందులో భాగంగానే పరిటాల ఫ్యామిలీ టీడీపీ వీడిపోతుందని ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. అలాగే శ్రీరామ్ టార్గెట్‌గా పోలీసు కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎం‌పి‌డి‌ఓని బెదిరించారని వైసీపీ ఎమ్మెల్యే కేసు పెట్టారు. అదేవిధంగా బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, రామగిరిలో ప్రసంగించారంటూ మరో కేసు నమోదు చేశారు.

 

అయితే ఎన్ని కేసులు పెట్టిన, పార్టీ వీడిపోతారని ఎంత ప్రచారం చేసిన శ్రీరామ్ మాత్రం తొణకడం లేదు. పైగా కన్నతల్లి లాంటి టీడీపీని వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ ఎంత ఇబ్బంది పెట్టిన శ్రీరామ్ మాత్రం వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: