కాంగ్రెస్‌కు కొత్త‌ర‌క్తం ఎక్కించే ప‌నిలో ఏఐసీసీ అన్ని రాష్ట్రాల‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుల‌ను ఎంపిక చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్య‌క్షుల ఎంపిక పూర్తి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు తెలంగాణ‌లో పార్టీ బాధ్య‌త‌లను ఎవ‌రికీ అప్ప‌జెబుతార‌నే అంశం అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. రాష్ట్ర రాజ‌కీయాలు పూర్తిగా వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగా మారిన వేళ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగే స‌మ‌ర్థుడి కోసం బాగానే కృషి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ  కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికకు రెండు రోజులపాటు ఢిల్లీలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించింది. 

 

ఈ ఇంట‌ర్వ్యూల‌కు  హాజరైన 28 మంది యువజన కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ నేత‌ల నుంచి  ఆసక్తికర ప్రశ్నలు ఎదురుకావ‌డం విశేషం. ఈ ఇంట‌ర్వ్యూల‌ను  ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవారు, యువజన కాంగ్రెస్‌ జాతీయ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి జేబీ మాథుర్ నేతృత్వంలో జ‌రిగాయి. తెలంగాణ  కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మీరు ఏరకంగా సమర్థులు?,  పదవి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీకు కాని పక్షంలో ఎవరిని ఈ పదవికి సూచిస్తారు? వంటి సాధారణ ప్రశ్నలు అడ‌గ‌టం విశేషం. కొస‌మెరుపు ఏంటంటే  కొత్తగా పీసీసీ అధ్యక్ష పదవికి మీరు ఎవరిని సూచిస్తారన్న ప్ర‌శ్న‌కు ఎక్కువ మంది  రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల పేర్ల‌ను తెలిపిన‌ట్లుగా తెలిసింది. 

 

ఈ న‌లుగురు కూడా ఒక‌ర‌కంగా ఫైర్‌బ్రాండ్‌లే. దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్‌లో ప‌నిచేస్తూ వ‌స్తున్నారు. ఇక మూడేళ్ల క్రితం ఎంపీ రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వ‌చ్చారు. అయితే ఈ న‌లుగురిలో రేవంత్‌రెడ్డికి మొద‌టి ప్రాధాన్యం, కోమ‌టిరెడ్డికి రెండ‌వ ప్రాధాన్యం, దుద్దిళ్ల‌కు మూడో స్థానం, పొన్నంకు నాలుగో స్థానంలో అవ‌కాశాలుంటాయ‌ని కాంగ్రెస్ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి మెడ‌కు ప‌లు కేసులు చుట్టుకున్న వేళ పార్టీ వాటిని ప‌నికి గుర్తింపుగా తీసుకుంటుందా..? ల లేక వివాదాస్ప‌దుడిగా ప‌క్క‌న పెట్టి కోమ‌టిరెడ్డికే అవ‌కాశం క‌ల్పిస్తుందా..? అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: