మిగిలింది మరికొద్ది గంటలే..! ఉరిని వాయిదా వేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ  విఫలమయ్యాయి. క్షమాభిక్ష అవకాశమే లేదు. సుప్రీం కోర్టు క్లియర్‌గా చెప్పేసింది. ఇక ఉరిశిక్ష అమలు చేయడమే ఫైనల్‌. రేపు ఉదయం నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు తీహార్ జైలు అధికారులు. 


నిర్భయ దోషులను ఉరి తీసేందుకు  ఆటంకాలన్నీ తొలిగిపోయాయి. ఉరి వాయిదా వేసేందుకు నలుగురు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 5గంటల 30 నిమిషాలకు నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయనున్నారు అధికారులు. ఇప్పటికే తీహార్ జైల్లో ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. తలారీ ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీశారు.

 

ఉరి వాయిదా కోసం శతవిధాల ప్రయత్నించారు దోషులు. నలుగురు దోషుల్లో ముగ్గురు ఉరిపై  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. తమ క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడంలో న్యాయపరమైన నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.... డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో హైడ్రామా నడిచింది. అక్షయ్ ఠాకూర్ భార్య ఢిల్లీ కోర్టు ఆవరణలో పెద్దగా విలపిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. 

 

మరో దోషి ముఖేశ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అత్యాచార ఘటన జరిగిన 2012 డిసెంబర్ 16న తానసలు ఢిల్లీలోనేలేనని, మరుసటి రోజు రాజస్థాన్‌లో తనను అరెస్టు చేశారని ఆరోపిస్తూ ముఖేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఐతే... న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఇప్పటికే దోషులు ఉపయోగించుకున్నారని... ఈ పిటిషన్‌ను విచారించలేమని తేల్చి చెప్పింది. 

 

ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడింది. నాలుగోసారి కూడా ఉరిశిక్ష వాయిదా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పాటియాల హౌస్ కోర్టు, సుప్రీం కోర్టులో ఓవైపు పిటిషన్‌ వేస్తూనే మరోవైపు ఐసీజేను ఆశ్రయించారు. అటు వైపునుంచి ఎలాంటి స్పందనా రాలేదు. న్యాయపరమైన అవకాశాలు ముగియడంతో... ఇక శుక్రవారం దోషులను ఉరి తీయడం ఖాయమే. దీంతో దోషి వినయ్ కుమార్ శర్మ తల్లి తన కుమారుడిగా చివరిసారిగా అతడికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలని కోరింది. తన కుమారుడికి పూరీ, సబ్జీ, కచోరీ అంటే చాలా ఇష్టమని జైలు అధికారులకు వివరించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: